పుల్వామాపై ఉగ్రదాడి అనంతరం భారతదేశం తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్‌పై ప్రెషర్ పెరిగిపోతోంది. తాజాగా అగ్రరాజ్యం పాక్‌కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం పాక్ విదేశాంగ కార్యదర్శి ఖురేషితో అమెరికా స్టేట్ సెక్రటరీ మాట్లాడారు. అనంతరం ఆ దేశానికి ఒక లేఖ రాశారు. ఉగ్రవాద శిబిరాలన్నింటినీ ధ్వంసం చేయాలని హుకుం జారీ చేసింది. ఒకవేళ అలా చేయకుంటే మాత్రం ఊహించని నష్టం జరుగుతుందని లేఖలో హెచ్చరిక చేసింది. ఉగ్రవాదంపై తీరు మార్చుకోవాలని, భారత్‌పై కవ్వింపు చర్యలు దిగొద్దని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇరుదేశాలు సంయమనం పాటించాలని హితవు పలికింది.
ఇదిలా ఉంటే ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఫిబ్రవరి 27వ తేదీ షోపియాన్ జిల్లాల్లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో తలదాచుకున్నారన్న విషయం తెలుసుకున్న భారత బలగాలు వారిని ఏరివేసేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. కాల్పుల్లో ఇద్దరు జైష్ – ఏ – మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరింత మంది ఉంటారని భావిస్తున్న భారత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తోంది.
1971 యుద్ధం తర్వాత మొట్టమొదటిసారిగా భారత వైమానికదళ యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం ఉదయం నియంత్రణ రేఖను దాటాయి. పీఓకే గగనతలంలోకి దాదాపు 90కిలోమీటర్లు దూసుకెళ్లాయి. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి. ఉగ్రవాద స్థావరాలపై 1000 కిలోల లేజర్ గైడెడ్ బాంబుల వర్షం కురిపించింది. 350-400 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌కు.. భారతదేశం ఉమ్మడి వార్నింగ్ ఇచ్చింది. జనవరి 26 గణతంత్ర దినమైతే.. ఫిబ్రవరి 26ను రణతంత్ర దినంగా మార్చి విజయనాదం చేసింది.