టీ షర్ట్ ధరించి, మంచం మీద పడుకుని వర్చువల్ హియరింగ్ కు హాజరైన ఓ న్యాయవాదిని సుప్రీంకోర్టు మందలించింది. కనీస కోర్టు మర్యాదలు పాటించాలని సూచించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యే న్యాయవాదులు ప్రదర్శించదగిన దుస్తులను మాత్రమే ధరించాలని తెలిపింది. వివరాళ్లోకి వెళితే హరియాణా రేవారిలోని ఫ్యామిలీ కోర్టులో ఓ కేసు పెండింగ్ లో ఉంది. ఆ కేసును బీహార్ జెహానాబాద్ లోని కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ జూన్ 15న ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసే క్రమంలో ఓ న్యాయవాది టీషర్టు ధరించి, మంచం మీద పడుకుని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు న్యాయవాది క్షమాపణలు కోరారు. ఈ సందర్భంగా జిస్టిస్ రవీంద్ర భట్ మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే కోర్టు విచారణలో హాజరయ్యే న్యాయవాదులు పద్ధతిగా కనిపించాలన్నారు. సమాజం ఇబ్బందిపడే విధంగా వ్యవహరించకూడదని తెలిపారు. మంచి దస్తులు ధరించి, కోర్టు మర్యాదలు పాటించాలని పేర్కొన్నారు.
కరోనా వైరస్ విజృంభణతో పనితీరును పరిమితం చేసిన సుప్రీంకోర్టు, ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను పరిష్కరిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రాజస్థాన్ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన బెయిల్ విచారణలో ఒక న్యాయవాది ఇదే తరహాలో హాజరవ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.