న్యాయం చేయాలంటూ రోడ్లెక్కిన పోలీసులు…భారీగా ట్రాఫిక్ జామ్

వందలాదిమంది ఢిల్లీ పోలీసులు ఇవాళ(నవంబర్-5,2019) రోడ్డుపైకి వచ్చారు. ITO దగ్గర ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం బయట తమకు న్యాయం చేయండంటూ నిరసనకు దిగారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. శనివారం తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటనకు నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు.

దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. విధుల్లోకి రావాలంటూ సీనియర్ అధికారులు చేసిన విజ్ఞప్తిని పోలీసులు తోసిపుచ్చారు. పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ స్వయంగా తమ దగ్గరకు వచ్చి మాట్లాడాలంటూ పట్టుబట్టారు. తీస్ హజారీ ఘటనకు నిరసనగా దిగువ కోర్టుల లాయర్లు ఢిల్లీలో సోమవారం నిరసనలకు దిగడం, ఆ నిరసనల సమయంలో కొందరు లాయర్లు ఢిల్లీ పోలీసు సిబ్బందిపై దాడి జరిపినట్టు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో రావడం సంచలనమైంది.

పోలీసు ప్రధాన కార్యాలయం బయట ఆందోళన చేస్తున్న పోలీసు సిబ్బందిని ఉద్దేశించి ఢిల్లీ కమిషనర్ అమూల్య పట్నాయక్ మాట్లాడారు. గత కొన్ని రోజులలో రాజధానిలో చాలా సంఘటనలను సమర్థవంతంగా హ్యాండిల్ చేశామని, ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడుతోందని పట్నాయక్ తెలిపారు. అందరూ శాంతించాలని తాను విజ్ణప్తి చేస్తున్నానన్నారు. లా అండ్ ఆర్డర్‌ను నిర్వహించడం, భరోసా ఇవ్వడం అనే బాధ్యతను నెరవేర్చాలన్నారు. పోలీసులపై దాడిచేసిన ఘటనల్లో ఎఫ్ఐఆర్ నమోదుచేయబడినట్లు తెలిపారు.

శనివారంనాటి ఘటనలో పోలీసు సిబ్బందితో సహా సుమారు 30 మంది గాయపడ్డారు. 20 వాహనాలు ధ్వంసమయ్యాయి. పార్కింగ్ విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఇంత పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనను సుమోటాగా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు ఆదివారం నాడు విచారణ చేపట్టి, జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. సెప్షల్ కమిషనర్ (శాంతిభద్రతలు) సంజయ్ సింగ్‌‌ను సస్పెండ్ చేయడంతో పాటు పలువురు పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించింది.