Leopard
Leopard : అడవుల్లో సంచరించే వన్యప్రాణులు తరచూ జనవాసాల్లోకి వస్తున్నాయి. అడవుల్లో ఆహారం, నీటి కొరతలతో వన్యప్రాణులైన చిరుతపులులు, పులులు, సింహాలు రోడ్లపైకి వస్తున్నాయి. దేశంలో ప్రతి రోజూ చిరుతపులులు జనవాసాల్లోకి వస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారిపై ఓ చిరుతపులి వచ్చి దర్జాగా నిలిచి ఉన్న ట్రక్కు కింద కూర్చుంది.
ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిపై…
ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిపై అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుతపులి ట్రక్కు కింద పాగా వేసింది. అంతే మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా మీదుగా జాతీయ రహదారిపై వెళుతున్న ప్రయాణికులు చిరుతపులిని చూసి భయాందోళనలు చెందారు. చిరుతపులి అరగంట పాటు ట్రక్కు కింద నుంచి కదలక పోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. చిరుతపులి ట్రక్కు కింద ఆశ్రయం పొందడాన్నివాహనాల డ్రైవర్లు చూసి అవాక్కయ్యారు.
చిరుతపులి వీడియో వైరల్
కొందరు డ్రైవర్లు వాహనం లోపల నుంచి చిరుతపులి నడిరోడ్డుపై ట్రక్కు కింద దర్జాగా కూర్చొని ఉండటాన్ని వీడియోలు తీశారు. రోడ్డుపై కూర్చున్న చిరుతపులి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిరుతపులి అరగంట పాటు ట్రక్కు కింద కూర్చొని ఉండడంతో ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీసులు చెప్పారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతం చుట్టూ కాపలా కాశారు.
ALSO READ : Telangana Assembly Elections 2023 : తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితులే అధికం
దాదాపు అరగంట తర్వాత చిరుతపులి సమీపంలోని పొలం వైపు వెళ్లింది. పరిస్థితిని గమనించిన అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిరుతపులి రాత్రి సమయంలో ట్రక్కు కిందకు వెళ్లి విశ్రాంతి తీసుకుందని, ఆ చిరుతకు గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. మొత్తం మీద చిరుతపులి రోడ్డుపై ప్రత్యక్షమవడంతో వాహనాల డ్రైవర్లు వణికిపోయారు. చిరుత పొలాల్లోకి పోయాక బతుకు జీవుడా అంటూ వాహనాల్లో గమ్యస్థానాల వైపు కదిలారు.
https://twitter.com/ANI/status/1723939208774160677
మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో కేవలం మూడు రోజుల వ్యవధిలో రెండు చిరుతపులులు జనవాసాల్లో సంచరించడం సంచలనం రేపింది. నాసిక్‌లోని ఓ చిరుతపులి బెడ్‌రూమ్‌లోకి చొరబడగా, అటవీశాఖ అధికారులు దానిని రక్షించారు. చిరుతపులి నాసిక్ నగరంలోని ఓ ఇంటి మొదటి అంతస్తులోని బెడ్‌రూమ్‌లో దాగి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అనంతరం అధికారులు ట్రాంక్విలైజర్‌తో కాల్చి చిరుతపులిని స్పృహ తప్పేలా చేసి మెట్లపై నుంచి కిందకు తీసుకువచ్చారు. చిరుతపులిని తీసుకువస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇంటి బెడ్రూంలో దాక్కున్న చిరుత
దీపావళి పటాకుల భయంతో ఓ చిరుతపులి ఇంట్లో దాక్కున్న ఉదంతం తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్‌లో దీపావళి పటాకులకు భయపడి చిరుతపులి ఓ ఇంట్లో ఆశ్రయం పొందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన చిరుతపులి 15 గంటల పాటు ఇంట్లోనే ఉంది.
సీసీ కెమెరాలు ఏర్పాటు
చిరుతపులిపై నిఘా ఉంచేందుకు అటవీశాఖ అధికారులు మూడు సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి చిరుతపులి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుందని మేం ఆశిస్తున్నామని అధికారులు చెప్పారు. చిరుతపులి కదలికలపై నిఘా ఉంచడానికి తాము సీసీటీవీని చూస్తున్నామని ముదుమలై టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ తెలిపారు.