Aravind kejriwal: అలా చేయకుంటే.. అమానతుల్లా ఖాన్‌లాగే అందర్నీ అరెస్టు చేస్తామని బీజేపీ బెదిరిస్తోంది..
గుజరాత్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో రోజురోజుకు ఆప్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ తట్టులేక పోతుందని ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
- Harish Thanniru
- Published on- September 18, 2022 / 09:02 PM IST
aravind kejriwal
Aravind kejriwal: గుజరాత్ రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో రోజురోజుకు ఆప్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ తట్టులేక పోతుందని ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో పార్టీ ప్రతినిధులతో ఆప్ నిర్వహించిన తొలి జాతీయ సదస్సులో కేజ్రీవాల్ మాట్లాడాడు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అవినీతి నెపంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ అణచివేయాలని చూస్తోందని, దీనికి కారణం బీజేపీకి గుజరాత్ లో ఓడిపోతామనే భయం పట్టుకోవటమేనని అన్నారు.
ఆప్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలని బీజేపీ వేధిస్తోందని, లేకపోతే ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌లాగే అందరినీ అరెస్టు చేస్తామని బెదిరిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ మరోవైపు తమపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. గత 75ఏళ్లలో బీజేపీ అతిపెద్ద అవినీతి ప్రభుత్వంగా అవతరించిందని అన్నారు.
గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆప్ వైపు ప్రజలు నిలుస్తారని బీజేపీకి అర్ధమైందని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆప్ కార్యక్రమాలకు కవరేజీ ఇవ్వొద్దని పలు టీవీ ఛానళ్లను మోదీ సలహాదారు బెదిరిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. టీవీ ఎడిటర్లకు మోదీ సలహాదారు పంపించిన సందేశాల స్క్రీన్ షాట్లు బయటకువస్తే ఆయనతో పాటు మోదీ కూడా దేశ ప్రజలకు మొహం చూపించలేరని అన్నారు.
