Earthquake In Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు, బొమ్మల్లా ఊగిన రైళ్లు.. వీడియోలు వైరల్

తైవాన్‌లోని తక్కువ జనాభా కలిగిన ఆగ్నేయ భూభాగంలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి పలు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Earthquake In Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు, బొమ్మల్లా ఊగిన రైళ్లు.. వీడియోలు వైరల్

Earthquake In Taiwan

Earthquake In Taiwan: తైవాన్‌లోని తక్కువ జనాభా కలిగిన ఆగ్నేయ భూభాగంలో ఆదివారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి పలు ప్రాంతాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలగా, పలు రైళ్లు పట్టాలు తప్పాయి. దీనికితోడు పర్వత ప్రాంతాల్లోని రహదారులపై వందలాది మంది చిక్కుకున్నారు. భూకంప కేంద్రం టైటుంగ్ కౌంటీలో ఉందని.. శనివారం సాయంత్రం అదే ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని, తాజాగా మరోసారి భూకంపం సంభవించిందని తెలిపింది. అయితే తాజా భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు.

Massive Earthquake In China: చైనాలో భారీ భూకంపం.. 46 మంది మృతి

తైవాన్ అగ్నిమాపక విభాగం సిబ్బంది యులీలో కూలిపోయిన భవనం నుంచి నలుగురిని రక్షించారు. అదేవిధంగా తాయున్ పట్టణంలోని ఓ స్పోర్ట్స్ సెంటర్‌లోని ఐదో అంతస్తులో ఉన్న గది సీలింగ్ విరిగిపడటంతో 36ఏళ్ల వ్యక్తి గాయపడ్డాడు. యూలీలోని ఓ రహదారిపై బ్రిడ్జ్ కుప్పకూలింది. ఈ సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. తూర్పు తైవాన్‌లోని డోంగ్లీ స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ పైభాగం కూలిపోయింది. ఆ సమయంలో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడ్డారని తైవాన్ రైల్వేస్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అయితే పలు రైల్వే స్టేషన్‌లలో భూకంపం దాటికి నిలిచియున్న రైళ్లు బొమ్మల్లా ఊగాయి. ఓ రైల్వే స్టేషన్లో పట్టాలపై ఆగిఉన్న రైలు బొమ్మలా అటూఇటూ ఊగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలాఉంటే చిక్, లియుషిషి పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఈ ప్రాంతంలో సుమారు 600 మంది టూరిస్టులు చిక్కుకున్నారని సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. రోడ్లపై పేరుకుపోయిన రాళ్లను తొలగించి రాకపోకలు సాగించేలా అక్కడి అధికారులు కృషిచేస్తున్నారు. ఈ భూకంపం దాటికి తైవాన్ సమీపంలోని అనేక దక్షిణ జపాన్ దీవులకు జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత వాటిని ఉపసంహరించుకుంది.

2016లో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,000 మందికి పైగా మరణించారు. అయితే, తాజాగా సంభవించిన భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కేవలం ఆస్తినష్టం సంభవించిందని అక్కడి అధికారులు తెలిపారు.