Pakistan Beggars: పిచ్చెక్కిస్తున్న పాకిస్తాన్ బిచ్చగాళ్లు..! ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి.. 56వేల మంది యాచకుల బహిష్కరణ..
చాలా కాలంగా హజ్, ఉమ్రా వీసాలను దుర్వినియోగం చేస్తూ చాలామంది పాకిస్తానీ యాచకులు మక్కా, మదీనాల్లో భిక్షాటన చేస్తున్నారు.
Pakistan Beggars: బిచ్చగాళ్లు బాబోయ్ బిచ్చగాళ్లు.. ఇదెక్కడి గోలరా నాయనా అని తల పట్టుకుంది సౌదీ అరేబియా. పాకిస్తాన్ బిచ్చగాళ్ల కారణంగా సౌదీ అరేబియా పరేషాన్ అవుతోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సతమతం అవుతోంది.
వీసా ఆంక్షలు ఉన్నాయి. నో-ఫ్లై జాబితాలు ప్రకటించారు. విదేశాల బహిష్కరణలూ ఉన్నాయి. అయినప్పటికీ… పాకిస్తాన్ బిచ్చగాళ్లు తగ్గేదే లే అంటున్నారు. యథేచ్చగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా సౌదీ అరేబియాలో పాక్ బిచ్చగాళ్లు పెద్ద తలనొప్పిగా మారారు. రెండు ఇస్లాం పవిత్ర స్థలాలు (మక్కా, మదీనా) ఉన్న సౌదీ అరేబియా.. ఇటీవల తన దేశం నుంచి 56వేల మంది పాకిస్తానీయులను బహిష్కరించింది. అయినా, వారి బాధ తప్పడం లేదు. తమ దేశంలో నేర కార్యకలాపాలకు పాల్పడటం, భిక్షాటన చేస్తున్నారనే కారణంతో గత నెలలో యూఏఈ చాలా మంది పాకిస్తానీలకు వీసాలను సైతం ఆపేసింది.
చాలా కాలంగా హజ్, ఉమ్రా వీసాలను దుర్వినియోగం చేస్తూ చాలామంది పాకిస్తానీ యాచకులు మక్కా, మదీనాల్లో భిక్షాటన చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా పాకిస్తానీ యాచకులు పశ్చిమాసియాలోని నగరాలను ముంచెత్తుతున్నారు. విదేశాల్లో వీధుల్లో భిక్షాటన కోసం తీర్థయాత్ర , పర్యాటక వీసాలను దుర్వినియోగం చేస్తున్నారు. పెరుగుతున్న ఈ ముప్పు ఆతిథ్య దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ కారణంగా కఠినమైన వీసా పరిశీలన, తిరస్కరణలు అమలు చేస్తున్నారు. దీంతో నిజమైన పాకిస్తానీ యాత్రికులు, కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పరిస్థితిని నియంత్రించకపోతే అది పాకిస్తానీ ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సౌదీ అరేబియా మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2024లో హెచ్చరించింది. సౌదీ అరేబియా వీధులు పాకిస్తానీ బిచ్చగాళ్లతో నిండి ఉన్నాయనేది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది.
పాకిస్తాన్ పరువు తీస్తున్న బిచ్చగాళ్లు..
అక్రమ వలసలు, భిక్షాటన బృందాలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయని పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ భద్రతా సంస్థ, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) చీఫ్ రిఫత్ ముఖ్తార్ వాపోయారు. ఈ పరిస్థితి నియంత్రణలోకి రాకుంటే హజ్, ఉమ్రా వెళ్లే పాకిస్తానీలపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. పశ్చిమాసియాలో నిర్బంధించబడిన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తాన్‌కు చెందిన వారే అని 2024లో విదేశీ పాకిస్తానీ కార్యదర్శి జీషన్ తెలిపారు. ఈ వ్యవస్థీకృత ముఠాలు విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2025లో 66వేల 154 మంది ప్రయాణికులతో జాబితాను సిద్ధం చేసింది.
చాలా మంది పని కోసం వీసాలు పొంది అక్కడికి వెళ్లాక భిక్షాటన చేస్తున్నారు. మక్కా, మదీనా లాంటి పవిత్ర స్థలాల్లో యాచిస్తూ.. డబ్బు కోసం విదేశీ యాత్రికులను వేధిస్తున్నారు. బాధితుల అపరాధ భావనను రెచ్చగొట్టి, వారి నుండి డబ్బును రాబట్టడం తెలిసిన నేర్పరి మోసగాళ్లు అని పాక్ బిచ్చగాళ్లను అభివర్ణించారు.
ఒక్క సౌదీ అరేబియాలోనే కాదు.. యూఏఈ, కువైట్, అజర్‌బైజాన్, బహ్రెయిన్ సహా అనేక పశ్చిమ ఆసియా దేశాలలో పాకిస్తానీ బిచ్చగాళ్లు కనిపిస్తారు. 2024లో పశ్చిమ ఆసియా దేశాలలో అదుపులోకి తీసుకున్న బిచ్చగాళ్లలో 90శాతం మంది పాకిస్తాన్‌కు చెందిన వారే అని తేలింది.
