Sputnik V
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పరిస్థితులు అదుపులోకి వస్తాయి అనుకున్నా.. ఇంకా కూడా ఇండియాలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రష్యాలో తయారైన ‘Sputnik V’ రూపంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. డీసీజీఐ ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వగా.. వ్యాక్సిన్ ధర ఇండియాలో రూ. 750లోపే ఉండే అవకాశం ఉంది.
లాన్సెట్‌లో ప్రచురించిన డేటా ప్రకారం 60 ఏళ్లు పైబడిన వాళ్లలో స్పుత్నిక్ వి సామర్థ్యం 91.8 శాతం కాగా.. మధ్యస్థ స్థాయి నుంచి తీవ్ర స్థాయి కొవిడ్-19 విషయంలో 100 శాతం సమర్థంగా పని చేస్తుంది. ఇండియాలో మొత్తం 13 వేల మంది క్లినికల్ ప్రయోగాల్లో పాల్గొనగా.. ఈ అధ్యయనం ఇంకా పూర్తి కావలసి ఉంది. ఈ వ్యాక్సిన్‌ను ద్రవ రూపంలో మైనస 18 (-18) డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద.. పొడి రూపంలో 2-8 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద దీనిని స్టోర్ చేయవలసి వస్తుంది. మన ఇండ్లలో ఉండే రిఫ్రెజిరేటర్‌లలో స్టోర్ చేసుకోవచ్చు కూడా. ప్రత్యేకంగా కోల్డ్-చెయిన్ అక్కర్లేదు.
ప్రస్తుతం ఇండియాలో ఇస్తోన్న వ్యాక్సిన్ల ధరలు.. రూ. 250 మాత్రమే కాగా.. ఈ వ్యాక్సిన్ మాత్రం అంతకుమించి ధర ఉంటుందని అంటున్నారు. ఈ ‘Sputnik V’ వ్యాక్సిన్ కూడా రెండు డోసులు ఇవ్వవలసి ఉంటుంది. తొలి డోసు (rAd26) ఓ వెక్టార్ కాగా.. రెండో డోసు (rAd5) మరో వెక్టార్. రెండు వేర్వేరు వెక్టార్లను వాడినా ఇవి రెండూ వైరస్ స్పైక్ ప్రొటీన్‌పై దాడి చేస్తాయి. ఒకే వెర్షన్ కంటే రెండు వెర్షన్లు వాడితే శరీరంలో రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుంది.
ఒక్కో డోసు 0.5 మిల్లీలీటర్లు. తొలి, మలి విడత డోసులకు కాస్త వేరుగా ఉండే వెర్షన్లను ఉపయోగించాలి. మొదటి డోసు వేసుకున్న 21రోజుల తర్వాత రెండవ డోసు వేసుకోవలసి వస్తుంది. జలుపు, తలనొప్పిలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్ప పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. వ్యాక్సిన్ వేసుకున్నవారు మరణించినట్లుగా కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు.
సంవత్సరానికి 850 మిలియన్లకు పైగా మోతాదుల ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని దేశంలోని ఐదు ఔషద సంస్థలైన గ్లాండ్ ఫార్మా, హెటెరో బయోఫార్మా, పనాసియా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్‌తో ఆర్డీఎఫ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. మొదటి మోతాదు ఏప్రిల్ చివరినాటికి పంపిణీ చేయబడుతుందని, మే ప్రారంభంలో మోతాదులు భారత్‌లో అందుబాటులో ఉండవచ్చునని అంటున్నారు.