Liquor mafia kills police constable : ఉత్తరప్రదేశ్‌లో లిక్కర్ మాఫియా రెచ్చిపోయింది. కస్‌గంజ్ జిల్లాలో పోలీసులపై దాడికి తెగబడింది. గ్యాంగ్‌స్టర్స్ చేసిన దాడిలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఎస్సైకు తీవ్ర గాయాలయ్యాయి. కస్‌గంజ్ జిల్లాలోని కల్తీసారాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కల్తీసారా తయారీ ఫ్యాక్టరీలో అర్ధ రాత్రి సోదాలకు దిగారు. అక్రమ మద్యాన్ని సీజ్ చేసేందుకు వచ్చిన పోలీసులను చూసి…లిక్కర్ మాఫియాకు చెందిన గూండాలు రెచ్చిపోయారు.
ఖాకీలపైనే భౌతికదాడులకు దిగారు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. చేతికి చిక్కినవారిని బంధించారు. కర్రలు, ఇతరత్రా ఆయుధాలతో దాడి చేసి రక్తమోడేలా కొట్టారు. ఒక కానిస్టేబుల్‌ను నగ్నంగా చేసి హింసించింది లిక్కర్ మాఫియా. ఈ అమానవీయ దుశ్చర్యలో కానిస్టేబుల్ దేవేంద్ర మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ఎస్సై అశోక్‌కుమార్‌కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.
విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన అదనపు బలగాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ లిక్కర్ మాఫియా గ్యాంగ్‌స్టర్స్ కోసం గాలింపు చేపట్టారు. సింధ్‌పురా సమీపంలోని నాగ్లా ధీమార్‌లో తీవ్రంగా గాయపడ్డ పోలీసులను కాపాడారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.
పోలీసులపై లిక్కర్ గ్యాంగ్ దాడిప పట్ల సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్‌ఐకి మెరుగైన చికిత్స అందించాలని, నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతి చెందిన కానిస్టేబుల్ దేవేంద్ర కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.