ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు : ఎల్‌జేపీ డిమాండ్

  • Publish Date - January 8, 2019 / 02:34 PM IST

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఎల్‌జేపీ మద్దతు ప్రకటించింది. అయితే ప్రైవేట్ రంగంలోనూ 60శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఎల్‌జేపీ(లోక్ జనశక్తి పార్టీ) ఎంపీ రాంవిలాస్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే 124వ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభ చర్చలో పాశ్వాన్ మాట్లాడారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల బిల్లుకి మద్దతిస్తూనే పాశ్వాన్ 3 సూచనలు చేశారు. జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్ల పెంపును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే న్యాయసమీక్షకు వెళ్లే అవకాశం ఉండదన్నారు.

సామాజిక న్యాయం కోసం పోరాడే వారిలో అన్ని వర్గాలవారున్నారని రాంవిలాస్ అన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల వారి కోసమే ఆర్టికల్ 16(4) తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఆ సమయంలో ధనవంతులు, భూస్వాములుగా ఉన్నవారు ఇపుడు పేదవారిగా మారారన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి కాకా కలేల్కర్, మండల్ కమిషన్ ఎన్నో సిఫార్సులు చేశాయని, వాటికి సంబంధించిన కులాల జాబితాలపైన ఎన్నో వైరుధ్యాలు, వివాదాలున్నాయని పాశ్వాన్ అన్నారు.