కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై విధి విధానాలను 2020, ఏప్రిల్ 15వ తేదీ బుధవారం విడుదల చేయనుంది. మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగనుండడంతో… ఎలాంటి మార్గదర్శకాలు ఉంటాయన్న చర్చ సాగుతోంది. అంతేకాదు… ఏవైనా సడలింపులు ఇస్తారా అని కూడా జనం ఎదురు చూస్తున్నారు. ఆర్థిక పరిస్థితి సంక్షోభంలోని వెళ్తున్న నేపథ్యంలో.. ఏయే రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తారన్నది ఆసక్తి రేపుతోంది. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో…. లాక్‌డౌన్‌ను కొనసాగించిన సంగతి తెలిసిందే.
లాక్‌డౌన్ సెకండ్ ఫేజ్‌లో ఏప్రిల్ 20 వరకు కఠినంగా అమల్లో ఉంటుందని మోదీ తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా సడలింపు ఉంటుందని వెల్లడించారు. అయితే విధివిధానాలు మాత్రం బుధవారం విడుదల కానున్నాయి. ఆర్థిక వ్యవస్థను పరిగణలోకి తీసుకొని పలు రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మోదీ తన సందేశంలో ఎక్కడా ఆ ప్రస్తావన చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఏయే రంగాలకు కాస్త వెసులుబాటు కల్పిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వ్యవసాయం, చేపల సాగు, ఫార్మా రంగానికి మినహాయింపు ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదుకాని జిల్లాల్లో హైవేలపై దాబాలు, ట్రక్ రిపేర్ షాపులు, భవన నిర్మాణ పనులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. స్థానిక కార్మికులతో సామాజిక దూరం పాటిస్తూ ఈ పనులకు సడలింపు ఇచ్చే అవకాశముంది.
అసోం, మేఘాలయ రాష్ట్రాలు మద్యం షాపులకు కొన్ని షరతులతో అనుమతిచ్చాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలకు కూడా తమ సొంత ఎక్సైజ్ పాలిసీని రూపొందించుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుందనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పలు రాష్ట్రాల సీఎంలు మద్యం అమ్మకాలను ప్రస్తావించారు. మద్యం విక్రయాల ద్వారా రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉండడంతో.. తద్వారా కొంతైనా ఆర్ధికంగా కుదుటపడతామని చెప్పారు.
Also Read | సీఎం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేకి కరోనా..అందరిలో టెన్షన్
2019-20 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా అసోం రాష్ట్రానికి 2000 కోట్ల ఆదాయం వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి 3000 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ రాబడి వస్తుంది. అందుకే మద్యం విక్రయాలకు కొంత సడలింపు ఇచ్చే అవకాశముంది. దేశంలో 7వందలకు పైగా జిల్లాలుంటే అందులో 370 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాల్లో మాత్రం లాక్‌డౌన్‌ను అమలు చేస్తారు. కరోనా కేసులను బట్టి దేశాన్ని మూడు జోన్‌లుగా విభజించనున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ కేసులు నమోదైన జిల్లాలను రెడ్ జోన్‌లుగా.. తక్కువ కరోనా బాధితులున్న జిల్లాలను ఆరెంజ్ జోన్లుగా పరిగణిస్తారు.
ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాని జిల్లాలన్నీ గ్రీన్ జోన్‌గా డివైడ్ చేస్తారు. కొన్ని అంశాల్లో సడలింపు ఉన్నప్పటికీ అంతర్ జిల్లా రాకపోకలకు మాత్రం అనుమతి ఉండదు. కేవలం నిత్యావసర సరుకు రవాణా, ఫార్మా రంగం, అత్యవసర సేవల వంటికి మాత్రమే అనుమతి ఉంటుంది. మే 3 వరకు లాక్‌డౌన్ అమలుకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనలో హోంశాఖ బిజీగా ఉంది. మరి ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయనుందో చూడాలి.