ప్రధాని మోడీ మరోసారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా క్యాబినెట్ తో భేటీ అయ్యారు. కొవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్ డౌన్ ఎత్తేయడానికి మంత్రులతో ఈ మీటింగ్ నిర్వహించారు. డిఫెన్స్ మినిష్టర్ రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సీనియర్ అధికారులు చర్చలో పాల్గొనగా మిగిలిన మంత్రులు వీడియో కాన్ఫిరెన్స్ లో పార్టిసిపేట్ చేశారు.
‘మంత్రులందరూ రాష్ట్ర, జిల్లా అడ్మినిస్ట్రేషన్‌తో టచ్ లో ఉండండి. అత్యవసర సమయాల్లో సాయం అందించేందుకు వెనుకాడకండి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆరోగ్య సేతు యాప్ ఇన్‌స్టాల్ చేసుకునేలా ప్లాన్ చేయండి. ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా ప్లాన్ చేయండి. సోషల్ డిస్టన్స్ పాటించకపోతే చేతుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాప్తి చెందుతుంది.
ఓ పది ప్రాంతాలను గుర్తించండి. పది కీలక నిర్ణయాలను ఆలోచించండి. లాక్ డౌన్ ముగిసేనాటికి ప్రతి మంత్రిత్వ శాఖ ఫోకస్ చేయాలి. మహమ్మారిపై పోరాడటంలో ఇంకా సమయం పట్టొచ్చు. మనం అలసిపోకూడదు. మహమ్మారిపై చేస్తున్న పోరాటాన్ని విజయవంతం చేయాలి’ అని మోడీ పిలుపునిచ్చారు.
ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ప్రారంభించింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహకరించడంతో పాటు కోవిడ్-19 బారిన మనం పడకుండా అటువంటి వారు మనల్ని సమీపిస్తే మనల్ని హెచ్చరిస్తుంది.