Locust Attack
Locust Attack : భారత్ – పాక్‌లు చేతులు కలిపాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఈ దేశాలు కలిసిపోవడమా ? ఎప్పుడూ తుపాకులతో ఘర్షణ వాతావరణం ఉండే ఈ దేశాలు ఓ విషయంలో మాత్రం చేతులు కలిపాయి. మిడతల విషయంలో ఈ దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. దాడులను అరికట్టేందుకు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండడం విశేషం. ఇప్పటి వరకు ఇండియా – పాక్ దేశాలు కోటి గుడ్లను నాశనం చేశాయి. ఈ రెండు దేశాల ఉమ్మడి ఆపరేషన్ ను ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. ఆఫ్రికన్ దేశాలు ఈ దేశాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికింది.
భారతదేశంలో మిడతలు ఏ విధంగా దాడి చేశాయో తెలిసిందే. ఇరాన్, అప్ఘనిస్తాన్ దేశాల నుంచి పాక్, భారత్ లోకి మిడతలు ప్రవేశించాయి. ఇవి పెద్ద ఎత్తున పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీటి నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితాలు కానరాలేదు. దీంతో ఈ రెండు దేశాలు ఉమ్మడిగా ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు. మిడతలకు చెందిన కోటి గుడ్లను నాశనం చేయడంతో వాటి వృద్ధి పెద్దఎత్తున్న నిలిచిపోయింది. ఫలితంగా ఈ ఏడాది ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి మిడతలు దాడిచేసే అవకాశాలు లేవు.
ఇందులో లోకస్ట్ హెచ్చరిక సంస్థ కీలకంగా ఉంది. పాక్, ఇండియా దేశాలు ఈ హెచ్చరిక వ్యవస్థను కలిగి ఉన్నాయి. భారతదేశంలో ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో కలిగి ఉంటుంది. ఇరాన్, అప్ఘనిస్తాన్ దేశాల్లో ఐరాస బృందం పర్యవేక్షిస్తోంది. డాటాను సేకరించడం, తమలో తాము పంచుకోవడం, మిడతలు ఎక్కడున్నాయి ? ఎంత పెరుగుతున్నాయో అంచనా వేస్తుంటారు. దాడులను నిలువరించేందుకు ఎలాంటి సన్నాహాలు చేయాలనే కార్యచరణ రూపొందిస్తారు. తద్వారా వీటిని అరికట్టే వ్యూహాలను రచిస్తారు. ఒక్కరోజులో నాశనం చేసే పంటలు దాదాపు 35 లక్షల మందికి సరిపోతుందని ఐరాస అధికారులు అంచనా వేస్తున్నారు.
మిడతల దాడులను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) సీనియర్ అధికారి కీత్ క్రెస్మాన్.. భారతదేశం-పాకిస్తాన్ సంయుక్త ఆపరేషన్‌ను ప్రశంసించారు. ఇరుదేశాలు మిడతల ఉగ్రవాదాన్ని అడ్డుకున్నాయని చెప్పారు. దీనివల్ల రెండు దేశాల్లోని రైతులుకు ఎంతో లబ్ది చేకూరుతుందని కీత్ క్రెస్మాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.