బీజేపీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సీట్ల త్యాగం.. ఈసారి అతి తక్కువ స్థానాల్లో పోటీ

ఈసారి ఎలాగైనా మోదీని దించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గి సీట్లు షేర్ చేసుకుంది కాంగ్రెస్.

Congress contests fewer seats: బలమైన బీజేపీని.. ఢీకొట్టేందుకు పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. అలయన్స్‌లో భాగంగా త్యాగానికి సైతం వెనకాడలేదు. ఈసారి ఎలాగైనా మోదీని దించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గి సీట్లు షేర్ చేసుకుంది కాంగ్రెస్. పొత్తుల్లో భాగంగా మునుపెన్నడూ లేనంతగా ఈసారి తక్కువ సీట్లలో పోటీ చేస్తుంది. 543 ఎంపీ సీట్లకు గాను ఈసారి 326 సీట్లలోనే అభ్యర్థులను బరిలో పెట్టింది కాంగ్రెస్. అంటే ఇంకా 217 సీట్లలో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించింది హస్తం పార్టీ.

326 సీట్లలో పోటీ చేస్తున్నప్పటికీ 281 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో మూడు సీట్లతో పాటు ఇంకా 45 సెగ్మెంట్లకు క్యాండిడేట్లను అనౌన్స్ చేయాల్సి ఉంది. 2004లో 417 సీట్లలో పోటీ చేసింది కాంగ్రెస్. ఇదే ఇప్పటివరకు అతి తక్కువ సంఖ్యగా ఉండగా.. ఇప్పుడు అంతకంటే తక్కువ స్థానాలకు పరిమితం అవుతుంది. 2004 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ పోటీ చేస్తున్న సీట్లు సంఖ్య 91 తగ్గింది.

ఒంటరిగా సాధ్యం కాదని..
ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయేను ఢీకొట్టడం ఒంటరిగా సాధ్యం కాదని.. ఇండియా కూటమిగా ఎన్నికల బరిలోకి దిగింది కాంగ్రెస్. కర్నాటక, తెలంగాణ, ఛత్తీస్‌గడ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కింతో పాటు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే పూర్తిస్థానాల్లో పోటీ చేస్తుంది కాంగ్రెస్. మిగిలిన రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి బరిలోకి దిగింది.

యూపీలో 17 సీట్లలో మాత్రమే పోటీ
80 ఎంపీ సీట్లున్న యూపీలో కాంగ్రెస్ పోటీ చేస్తున్నది కేవలం 17 సీట్లు మాత్రమే. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ, మిగతా మిత్రపక్షాలకు 63 సీట్లు కేటాయించింది. ఇక మహారాష్ట్రలో 48 సీట్లకుగాను హస్తం పార్టీ 17సీట్లలో.. దాని మిత్రపక్షాలు శివసేన యూబీటీ 21 సీట్లు, NCP శరద్ పవార్ పార్టీ 10 సీట్లలో పోటీ చేస్తున్నాయి. పశ్చిమబెంగాల్ 42కు గాను 13 సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ వామపక్షాలతో సీట్లు షేర్ చేసుకుంది. బీహార్‌లో 40సీట్లకు 9సీట్లలో, తమిళనాడులో 39 సీట్లకు 9 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో 249 స్థానాలకు గాను.. కేవలం 25 శాతం సీట్లలో అంటే 65 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది కాంగ్రెస్.

Also Read: ఏపీలో రూ.125 కోట్లు, తెలంగాణలో రూ.121 కోట్లు సీజ్.. ఎన్నికల్లో ధన ప్రవాహానికి ఈసీ చెక్

గుజరాత్, హర్యానాలో ఆప్‌తో సీట్ల సర్దుబాటు
ఒడిశాలో 21 సీట్లకు గాను 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్, హర్యానాలో ఆప్‌తో సీట్ల సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్.. పంజాబ్‌లో మాత్రం సింగిల్‌గానే పోటీ చేస్తుంది. పశ్చిమబెంగాల్, ఏపీలో వామపక్షాలతో పొత్తులో ఉంది. కేరళలో మాత్రం లెఫ్ట్ పార్టీలో హోరాహోరీగా తలపడుతోంది హస్తం పార్టీ.

ఈశాన్య రాష్ట్రాల్లో అంతంత మాత్రం
కేరళ, తెలంగాణ, కర్నాటక, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్‌లో మాత్రమే బీజేపీకి బలమైన పోటీ ఇచ్చేస్థాయిలో ఉంది కాంగ్రెస్. యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్‌లలో కాంగ్రెస్ ఇండియా కూటమి అంత బలంగా లేదని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని 25 సీట్లలో కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందంటున్నాయి సర్వేలు.

Also Read: 10 ఉచిత ఎల్పీజీ సిలెండర్లు, 100 రోజుల ఉపాధి.. తృణమూల్ కాంగ్రెస్ మ్యానిఫెస్టో

సింగిల్‌గా పోటీ చేసేస్థాయి నుంచి కూటమిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్.. ఈసారి సీట్ల విషయంలో త్యాగం చేయాల్సి వచ్చింది. దేశంలో సగం రాష్ట్రాల్లో మాత్రమే పూర్తిస్థాయి సీట్లలో పోటీ చేస్తుంది హస్తం పార్టీ.

ట్రెండింగ్ వార్తలు