బీజేడీకి షాక్ ఇచ్చిన బీజేపీ.. ఒడిశాలో ఒంటరిగా పోటీ

నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీకి కమలం పార్టీ గట్టి షాక్ ఇచ్చింది.

No BJP BJD Alliance: ఒడిశాలో బిజూ జనతా దళ్ (BJD) పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. అసెంబ్లీ, లోక్‌స‌భ‌ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈసారి బీజేడీతో కాకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 21 లోక్‌స‌భ‌, 147 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఒడిశాలోని 4.5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి సోలోగానే బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ఒడిశా అభివృద్ధి సాధ్యమన్నారు.

”గత పదేళ్లుగా నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతా దళ్ (BJD) పార్టీ అనేక విషయాల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. దీనికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడ డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చినా అక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. కానీ మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఒడిశాలో సరిగా అమలు కావడం లేదు. దీంతో ఒడిశా ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఒడిశాలోని 4.5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంద”ని మన్మోహన్ సమాల్ తెలిపారు.

ఎంతో కాలంగా మిత్రపక్షంగా ఉన్న బీజేడీని బీజేపీ వదులుకోవడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చాలా కాలంగా కాషాయ పార్టీ వెంట ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో పొరపొచ్చాలు రావడంతో పొత్తుకు ఎండ్ కార్డ్ పడింది.

Also Read: టీడీపీ థర్డ్ లిస్ట్‌లో ట్విస్ట్.. తెలంగాణ బీజేపీ నాయకుడికి ఏపీ టీడీపీ టికెట్