ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  • Publish Date - January 8, 2019 / 04:25 PM IST

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. డివిజన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్‌లో రాజ్యాంగ సవరణ బిల్లుకి అనుకూలంగా 323 ఓట్లు పడ్డాయి. ముగ్గురు వ్యతిరేకంగా ఓటు వేశారు. మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. మొత్తం 326మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 124వ రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్‌సభలో 5గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకి పార్టీలు మద్దతిస్తూనే పలు సవరణలు ప్రతిపాదించాయి. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో డివిజన్ ఓటింగ్ తప్పనిసరి అని స్పీకర్ చెప్పారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలన్నీ వీగిపోయాయి. కీలక బిల్లుని హడావుడిగా ప్రభుత్వం తీసుకొచ్చిన తీరుని విపక్షాలు తప్పుపట్టినా.. బిల్లు ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని మద్దతు తెలిపాయి. తమకున్న అనుమానాలు, అభిప్రాయాలు తెలుపుతూ, సవరణలు ప్రతిపాదిస్తూ ఈబీసీ రిజర్వేషన్ బిల్లుని సమర్థించాయి.

అగ్రకులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 124వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చింది. ఈబీసీలకు రిజర్వేషన్ల కోసం ఆర్టికల్ 15, 16కి సవరణలు చేసింది. చట్టబద్దత కోసం ఆర్టికల్ 15 , 16కి అదనంగా క్లాజ్(6)లను కేంద్రం జోడించింది. కులాలు, మతాలకు అతీతంగా ఈబీసీలందరికి రిజర్వేషన్లు కల్పిస్తారు. లోక్‌సభ ఆమోదంతో ఈబీసీల రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది.