రాజకీయ నాయకులు చెప్పే స్వీట్ అబద్దాలకు మురిసిపోతుంటాం కదా? కానీ చేదు నిజాలు చదివాలంటే మాత్రం ధైర్యం కావాలి. ఓస్ ఇంతేనా? అనిపించే వార్తే అనుకుంటే ఇది చిన్న వార్తే కానీ ఓ పిల్లవాడు.. ఎనిమిదేళ్ల బాలుడు తిండి దొరక్క చనిపోవడం అంటే.. నిజంగా ఇది సభ్య సమాజం.. దేశాన్ని ఏలుతున్న నేతలు తలదించుకోవలసిందే. పూట తిండి దొరక్క ఓ బాలుడు చనిపోయాడంటే.. రోజు తినే అన్నం వేస్ట్ చేసే ఎంతోమంది కచ్చితంగా ఆలోచించవలసిన విషయం.. కాదంటారా? మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. చంద్రుడు మీదకు రాకెట్లను పంపిస్తున్నాం అని జబ్బలు చరుచుకుంటున్నాం. కానీ అదే దేశంలో ఓ పిల్లవాడు తిండి లేక చనిపోయాడు.
మధ్యప్రదేశ్‌లోని బార్వానీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తినడానికి తిండి దొరక్క ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాదు అతని కుటుంబంలోని మిగతా ఐదుగురు వాంతులు, డయేరియాతో హాస్పిటల్‌లో చేరారు. వివరాల్లోకి వెళ్తే.. కొంతకాలంగా రతన్‌కుమార్ అనే వ్యక్తి కుటుంబానికి తిండి లభించట్లేదు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబం.. రోజువారి కూలీ పని ద్వారా జీవనం సాగిస్తోంది. అయితే కొన్ని రోజులుగా పని దొరకలేదు. దీంతో తినడానికి తిండి లేదు. ఆ కుటుంబం ఆకలితో అలమటించింది. 8 ఏళ్ల బాలుడు తినటానికి తిండి లేక చనిపోయాడు. ప్రభుత్వం అందించే రేషన్ కూడా వారికి లభించకపోవడమే ఇందుకు కారణం. వారి రేషన్ కార్డు ఏమైంది.. ఉందా లేదా అనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు.
సమయానికి కడుపులో ఏదో ఒకటి పడకపోతే పేగులు ఎండిపోయినట్లు అనిపిస్తాయ్. ఒక్క పూట అన్నం తినకపోతే ఇబ్బందిగా అనిపిస్తుంది. అటువంటిది కొన్ని రోజులుగా ఆ కుటుంబం ఏమీ తీసుకోకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఎంత దారుణం. ఇదే విషయమై బార్వానీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అన్షు జావ్లా విచారణకు ఆదేశించారు. వారు ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తుందని వెల్లడించిన ఆయన.
ప్రభుత్వం అందించే సరుకులు వాళ్లకు ఎందుకు అందలేదనే విషయాన్ని కూడా విచారిస్తామని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ అందించే సదుపాయాలు వారికి అందేలా చూస్తామన్నారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశంలో ఓ కుటుంబం మొత్తం ఆకలితో అలమటించటం, రేపటి పౌరుడు తిండి లేక చనిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు నెటిజన్లు. దేశం సిగ్గుపడాలి.. మనం సిగ్గుపడాలి అంటూ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూపాయి, 2 రూపాయలకే బియ్యం అని చెబుతున్నారు.. అదంతా ఎటుపోతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలంటున్నారు.