నేడే కమల్ సర్కారుకు బలపరీక్ష: కమలం నెగ్గేనా? కాంగ్రెస్ గట్టెక్కేనా?

  • Publish Date - March 19, 2020 / 09:04 PM IST

దేశం మొత్తం రెండోసారి ఎన్నికల్లో హవా సాగించిన కమలం.. బలమైన పార్టీగా నిలబడింది. అయితే చాలా రాష్ట్రాల్లో మాత్రం పట్టు కోల్పోయింది. ఈ క్రమంలోనే ఒక్కొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీల నుంచి అసమ్మతి భావుటా ఎగరవేయించి అవిశ్వాస పరీక్షలతో ప్రభుత్వాన్ని పడగొట్టి, చివరకు రాష్ట్రాలను హస్తగతం చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే కర్నాటక ఆపరేషన్ సక్సెస్ చేసింది కమలం పార్టీ.. కుమారస్వామిని ఇంటికి పంపేసి కుర్చీని ఆక్రమించేసింది. ఇక హర్యానాలో మెజారిటీ లేకపోయినా అధికారంలోకి వచ్చేసింది… అక్కడ ఇక ఢోకా లేదు… మహారాష్ట్రలో శివసేన చేయిచ్చినా సరే, శరద్ పవార్‌ దర్శకత్వంలో అజిత్ పవార్‌ను ముందు పెట్టి ఓ డ్రామా ఆడి చివరకు కుదరక సర్ సర్లే తర్వాత చూసుకుంటాం అనుకుంటూ తగ్గింది. 

అయితే ఆ రాష్ట్రం జోలికి వెళ్లే ముందే తమ చేయి జారిపోయిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలపై కన్నేశారు కమలనాధులు. ఇంకేముంది ముందు మధ్యప్రదేశ్… జ్యోతిరాదిత్య సింథియాని పట్టుకున్నారు. ఆమధ్య ప్రధాని మోడీని కూడా కలిసేశాడు. అప్పటి నుంచే పావులు కదుపుతున్నాడు. ఎలాగైనా కమల్ నాథ్ సర్కార్ ని పడగొట్టేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆయన వర్గంగా చెప్పుకునే 22మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసేశారు. సింథియా కూడా కాంగ్రెస్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయాడు. 

మధ్యప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 231… కాంగ్రెస్ గెలిచింది 115… అంటే మెజారిటీ మార్కుకు ఒకటీరెండు తక్కువ… బీఎస్పీ రెండు, ఎస్పీ ఒకటి, నలుగురు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకుని నడుస్తుంది సర్కారు. బీజేపీకి వచ్చిన సీట్లు 107 అంటే ఓ తొమ్మిది మంది గనుక దొరికితే చాలు కమలనాథుడిని కూల్చేయొచ్చు. ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ సర్కార్ బలం తగ్గిపోయింది. 

దీంతో కమలం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ పట్టుబట్టింది. మార్చి 16వ తేదీన అవిశ్వాస తీర్మానం జరగవలసి ఉండగా..  కరోనా వైరస్‌ ప్రభావంతో అసెంబ్లీ సమావేశాలను మార్చి 26కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అయితే కమలం పార్టీ దీనిపై సుప్రీంకోర్టుకు పోయింది. ఈ ఇష్యూలో తక్షణ తీర్మాణం కోరుతూ బీజేపీ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ(20 మార్చి 2020) సాయంత్రం 5గంటలలోపు కమల్‌నాథ్‌ బలపరీక్షలో నెగ్గాలని ఆదేశించింది. దీంతో ఇవాళ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. ఈ బలపరీక్షలో కమలం నెగ్గేనా? కాంగ్రెస్ గట్టెక్కేనా? అనేదానిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

Also Read | వాళ్లు రేపటి సూర్యున్ని చూడలేరు..: ఆఖరి అవకాశం అయిపోయింది.. ఇక ఉరే!