మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: గవర్నర్ సంచలన నిర్ణయం

  • Publish Date - November 12, 2019 / 10:00 AM IST

మహారాష్ట్రలో రాజకీయం వేగంగా మారుతుంది. గవర్నర్ ఇప్పటికే ప్రధాన పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే బీజేపీ, శివసేనను విడివిడిగా ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిన గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా కదులుతున్నారు. ఈ క్రమంలోనే మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్‌సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించింది ప్రభుత్వం.

దీంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటల్లోగా పవార్ ప్రభుత్వ ఏర్పాటు సన్నద్ధతపై గవర్నర్‌కు ఏదో ఒక సమాధానం చెప్పాల్సి ఉండగా.. దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమష్టిగానే తీసుకుంటామని, కాంగ్రెస్ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు ఇప్పటికే ఎన్‌సీపీ కూడా ప్రకటించింది.

ఈ క్రమంలోనే మరో కీలక విషయం ఏమిటంటే రాత్రి 8గంటల లోపు ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే గవర్నర్.. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయనున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈలోపే గవర్నర్ రాష్ట్రపతికి రాసిన లేఖను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఎన్నికల్లో మెజార్టీ దక్కించుకున్న పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయని కారణంగా ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆయన సిఫార్సు చేశారు.