ప్రభుత్వ ఏర్పాటుకు ముందే వరాలు: రైతు సంక్షేమమే ఎజెండా.. స్థానికులకే ఉద్యోగాలు

  • Publish Date - November 28, 2019 / 12:51 PM IST

దేశంలో అత్యంత దయనీయమైన జీవితం బతుకుతున్నది ఎవరూ? అంటే రైతు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ హక్కులుంటయ్, డిమాండ్లుంటయ్, సంఘాలుంటయ్.. కానీ రైతులకే ఏమీ ఉండవు.. అయితే ఎంతో కష్టపడి అందరి జానెడు పొట్టను నింపేది మాత్రం ఆ రైతే. అటువంటి రైతులకు మ్యానిఫెస్టోల్లో ఏవో హామీలు ఇస్తుంటాయి కానీ, నిర్మాణాత్మక సాయం మాత్రం చేయదు. 

అయితే లేటెస్ట్‌గా మహారాష్ట్రలో ఏర్పడుతున్న ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా క్లారీటీగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ శివసేన-ఎన్‌సీపీ- కాంగ్రెస్‌ల కూటమి (మహా వికాస్‌ అఘాడీ) తమ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో రైతులకు పద్ద పీట వేశాయి. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

రైతు సమస్యలు, నిరుద్యోగం, వైద్యం, పరిశ్రమలు, సామాజిక న్యాయం ఇలా పలు అంశాలతో మినిమమ్ ప్రోగ్రామ్‌ విడుదల చేశాయి. రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని సీఎంపీలో మూడు పార్టీలు నిర్ణయం తీసుకోగా.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించాయి. స్థానిక యువతకే 80 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తీసుకుని రావాలని నిర్ణయించాయి.

ఒక రూపాయికే వైద్యం.. క్లీనిక్కులను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శివసేన ఎన్నికల హామీ అయిన రూ.10కే భోజనాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. ప్రభుత్వానికి, కూటమి పార్టీలకు మధ్య సమన్వయం కోసం రెండు ప్యానెల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎంపీలో మూడు పార్టీలు స్పష్టం చేశాయి. అలాగే మహా వికాస్‌ అఘాడీ విడుదల చేసిన కనీస ఉమ్మడి కార్యక్రమంలో లౌకికవాదం ప్రస్తావన ఉంది. లౌకికవాదాన్ని కాపాడాలని మూడు పార్టీలు నిర్ణయించాయి.