మహాకూటమి ఓటమిలో కాంగ్రెస్ దే కీలక పాత్ర!

బీహార్​ లో మహాకూటమి బంధం విఫలమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ మహాకూటమికే అనుకూలంగా వచ్చినప్పటికీ.. తీరా ఫలితాలు వెల్లడయ్యేసరికి పరిస్థితి తలకిందులైంది. ఆర్జేడీ లాంతరు వెలుగు బిహార్ సీఎం సీటుకు దారి చూపలేదు. కాంగ్రెస్ చతికిలపడటం.. కూటమిని నిండా ముంచింది. విజయానికి కొద్దిపాటి దూరంలో నిలిచిపోయింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలక్రిందులు చేసి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 243స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122ఉండగా..125స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. రాష్ట్రాన్ని 15ఏళ్ల పాటు పాలించిన నితీశ్​కుమార్​.. మరోమారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.

బీహార్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరాశపరిచింది. గత ఎన్నికల్లో 27 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్.. ఈ సారి 6 స్థానాలను కోల్పోయింది. 1989 తర్వాత 2015 అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ ఉత్తమ పనితీరు చూపించింది. కానీ మళ్లీ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. ఫలితాల విషయం అటుంచితే ప్రచార సమయంలోనూ కాంగ్రెస్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ కి చెక్​ పెట్టాలని చూస్తున్న హస్తం పార్టీ…2020 బీహార్​ ఎన్నికలను ముందుండి నడిపించలేకపోయింది.

బీహార్ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ నియమించినప్పటికీ.. వారిలో అత్యధికులు ప్రచారంలో పాల్గొనలేదు. రాహుల్ గాంధీ ఎనిమిది సభలకు హాజరైనా, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంకా గాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఓవైపు ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారంలో పాల్గొంటుంటే తేజస్వీ యాదవ్ మినహా వారిని దీటుగా ఎదుర్కొనే సరైన నాయకుడు మహా కూటమిలో కనిపించలేదు. కాంగ్రెస్ లో సరైన నాయకత్వం లేకుండా సాగిన ప్రచార సరళి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించింది.

మరోవైపు.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ అన్నీ తానై ప్రచార బాధ్యతలు తనపై వేసుకున్నారు. మహాకూటమిని ముందుండి నడిపించారు. బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లేకున్నా ఆ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు గెలవగలిగిందంటే దానికి ప్రధాన కారణం తేజస్వీనే.