అడవిలో ఇప్పపువ్వు సేకరణకు వెళ్లినవారిపై పెద్దపులి దాడి..పంజాకు రెండు ప్రాణాలు బలి

2 killed in tiger attack in Chandrapur : ఇప్పపువ్వు. సపోటేసి కుటుంబానికి చెందిన చెట్టు. అడవితల్లి ఒడిలో ఇప్పచెట్లకు పువ్వులు విరగకాస్తాయి. ఈ ఇప్పపువ్వుల్ని సేకరించి అమ్ముకుంటారు ఎంతోమంది. ముఖ్యంగా ప్రకృతితో మమేకమై అడవితల్లినే నమ్ముకుని జీవనం సాగించే గిరిజనులు..ఆదివాసీలు ఈ ఇప్పపువ్వులను సేకరించి అమ్ముకుంటుంటారు. అలా అడవిలో ఇప్పపువ్వు సేకరణకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు పులి పంజాకు బలయ్యారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మంగళవారం జరిగిందీ విషాదకర ఘటన.

సారా తయారీలో ఉపయోగించే ఇప్ప పువ్వుకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఇప్పపువ్వు ఏరుకోవటానికి సిందేవాహి తాలూకాలోని పవన్‌పార్ గ్రామానికి చెందిన కమలాకర్ అనే 65 వృద్ధుడు తన సోదరుడి కొడుకు దుర్వాస్ అనే వ్యక్తితో పాటు ..మరికొందరు కలిసి ఖైరీ గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లారు.

పువ్వు సేకరిస్తున్న సమయంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేదు. పువ్వులు ఏరుకుంటున్నవారిపై ఓ పెద్దపులి హఠాత్తుగా వారిపై దాడిచేసింది. పులి దాడిలో కమలాకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమను కూడా చంపేస్తుందనే భయంతో ప్రాణాలు కాపాడుకోవటానికి చేతికి అందిన కర్రతో అక్కడున్న మిగిలినవారు పులిని అదిలించారు. కానీ బెదరని పులి దుర్వాస్‌పైనాకూడా దాడిచేసింది. పులి పంజా దాడికి దుర్వాస్ కూడా బలైపోయాడు.

దీంతో మిగతావారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అక్కడనుంచి భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. పులి దాడి చేయడం ఈ వారంలో ఇది మూడోసారని అడవికి సమీజంలోని గ్రామస్థులు తెలిపారు. పులి బారినుంచి ప్రజలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు