Pratap Chandra Shetty, Nana Patole మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోలే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు అందజేశారు. కాంగ్రెస్‌కు చెందిన పటోలే రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. త్వరలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. అందుకే ఆయన తన స్పీకర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మిత్రపక్షాలకు కాంగ్రెస్ సమాచారం ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నానా పటోలే 2014లో భండారా-గోండియా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2017లో బీజేపీకి గుడ్ బై చెప్పి 2018లో తిరిగి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. 2019లో మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన మహావికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
మరోవైపు, కర్ణాటక శాసన మండలి చైర్మన్ కె ప్రతాపచంద్ర శెట్టి తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆయనను ఆ పదవి నుంచి తొలగించేందుకు బీజేపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి జేడీఎస్ మద్దతిచ్చింది. తన తొలగింపునకు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చకు అనుమతించకుండానే చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. మండలిలో కాంగ్రెస్‌కు తగినంత బలం లేకపోవడంతో ప్రతాపచంద్ర శెట్టి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. తన వీడ్కోలుపై గురువారం పది నిమిషాల పాటు మాట్లాడిన ఆయన సభను శుక్రవారానికి వాయిదా వేశారు.