బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయం…బీజేపీ ప్రకటన

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ చేతులెత్తేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు శనివారం బీజేపీని గవర్నర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ(నవంబర్-10,2019)గవర్నర్ ని కలిసిన బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు,తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు తమ దగ్గర తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ కు చెప్పారు

గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీతో సమావేశం అనంతరం మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాఠిల్ మాట్లాడుతూ…తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. కలిసి పనిచేయాలని ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమికిమ ప్రజలు తీర్పు ఇచ్చారని, మహారాష్ట్ర ప్రజల తీర్పుని శివసేన వమ్ము చేసిందని అన్నారు. ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే వారికి మా బెస్ట్ విషెస్ అని పాఠిల్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ చేతులెత్తెయ్యడంతో రెండవ ఆఫ్షన్ గా కాంగ్రెస్-ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన కూటిమికి స్పష్టమైన మెజారిటి వచ్చినప్పటికీ శివసేన 50:50 ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 105మంది ఎమ్మెల్యేలు ఉండగా,స్వతంత్రులుగా గెలిచిన 29మంది ఎమ్మెల్యేలలో 15మంది ఇప్పటికే బీజేపీ జై కొట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తం 145 మంది మద్దతు అవసరముండగా ఇంకా బీజేపీకి 25మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయం అని బీజేపీ ప్రకటించడంతో శివసేన… ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.