సల్మాన్ ఖాన్‌కు అండగా ఉంటాం.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే హామీ

తమ ప్రభుత్వం అండగా ఉంటుందని బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే భరోసాయిచ్చారు.

Maharashtra CM Eknath Shinde: బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బాసటగా నిలిచారు. తమ ప్రభుత్వం సల్మాన్ ఖాన్‌కు అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. సల్మాన్ ఇంటి వెలుపల కాల్పుల ఘటన నేపథ్యంలో మంగళవారం ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్‌ ఇంటికి సీఎం షిండే విచ్చేశారు. ముఖ్యమంత్రి షిండే రాక నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయనకు సల్మాన్ సాదర స్వాగతం పలికారు. షిండే వెంట కుమారుడు జీషన్‌, ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ ఉన్నారు. సల్మాన్ తండ్రి, ప్రముఖ స్క్రీన్ ప్లే రచయిత సలీం ఖాన్‌తో సీఎం షిండే కరచాలనం చేశారు. కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాలను సల్మాన్ ఖాన్‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల ముఖ్యమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ.. “ప్రభుత్వం మీ వెంటే ఉందని సల్మాన్ ఖాన్‌తో చెప్పాను. సల్మాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించి, కేసు పూర్వాపరాలు తెలుసుకుంటాం. దోషులెవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరినీ ఈ విధంగా టార్గెట్ చేయడానికి వీల్లేదు. ఏ గ్యాంగ్ లేదా గ్యాంగ్ వార్ అనుమతించం. దాదాగిరి చేసే వారి పట్ల కఠినంగా ఉంటాం. (లారెన్స్) బిష్ణోయ్‌ని మట్టు బెడతామ”ని అన్నారు.

ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసముంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రముఖుల హత్య కేసుల్లో నిందితుడిగా లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.

Also Read: మీరేం అమాయకులు కాదు.. రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీంకోర్టు ఆగ్రహం

గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుంచి బెదిరింపులు రావడంతో నవంబర్ 2022 నుంచి సల్మాన్ ఖాన్ భద్రతను వై-ప్లస్‌కి పెంచారు. వ్యక్తిగత తుపాకీని తీసుకెళ్లడానికి కూడా సల్మాన్ ఖాన్‌కు అనుమతి ఉంది. అదనపు రక్షణ కోసం ఒక సాయుధ వాహనం ఆయన వెంట ఎప్పుడూ ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు