corona
Maharashtra : మహారాష్ట్రను కరోనా కేసులు పట్టి పీడిస్తున్నాయి. దీంతో వరుసగా ఒక్కో జిల్లా లాక్‌డౌన్, జనతా కర్ఫ్యూ అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా జల్‌గావ్ జిల్లాలో కర్ఫ్యూ ప్రకటించారు అధికారులు. మార్చి 11 నుంచి 15 వరకు జనతా కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 11 రాత్రి 8 గంటలకు మొదలయ్యే జనతా కర్ఫ్యూ మార్చి 15 ఉదయం 8 గంటల వరకు కొనసాగుతుంది. ప్రజలెవరు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. కేవలం అత్యవసర సర్వీసులకే అనుమతి ఇచ్చారు.
మాహారాష్ట్రలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ప్రతీ రోజు పది వేలలకు అటు ఇటుగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 9 వేల 927 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలు వైరస్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అమరావతి, యావత్మాల్ జిల్లాలో కర్ఫ్యూ, పాక్షిక లాక్‌డౌన్లు అమల్లో ఉండగా గత మూడు రోజుల్లో వరుసగా ఔరంగాబాద్, థానే జిల్లాలలో లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జల్‌గావ్ జిల్లా ఈ జాబితాలో చేరింది.
జనసాంద్రత ఎక్కువగా ఉండే ముంబైలో నిన్నా మొన్నటి వరకు కేసుల సంఖ్య తక్కువగా ఉండేది. తాజాగా ముంబైలో భాగమైన థానేలో కేసులు పెరగడం, ధారవిలో ఒకే రోజులో 18 పాజిటీవ్ కేసులు బటయపడటంతో మహా సర్కారు పరిస్థితి మరింత విషమించకుండా జాగ్రత్త పడుతోంది.