Ajit Pawars Plane Crash
Plane Crash : ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ఉదయం విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా బారామతిలో పలు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. పైలట్లు, పవార్ భద్రతా సిబ్బంది కూడా విమానంలో ఉన్నారు. వారంతా విమాన ప్రమాదంలో మృతి చెందారు.
ఉదయం 8గంటలకు ముంబై నుంచి బయలుదేరిన చిన్న ప్రత్యేక విమానం 45 నిమిషాల తరువాత అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో బారామతి వినాశ్రయం సమీపంలో పొలాల్లో కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది నిమిషాల్లో గమ్యానికి చేరుకుంటామనగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ విమానంను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. అదుపుతప్పి విమానం కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైనట్లు తెలుస్తోంది. విమానం కూలినవెంటనే మంటలు చెలరేగాయి. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బతికిలేరని.. అజిత్ పవార్ తో సహా ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా మరో ఐదుగురు మృతి వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి మహారాష్ట్ర సీఎంకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. అజిత్ పవార్ 1959 జులై 22వ తేదీన జన్మించాడు. మహారాష్ట్ర మాజీ సీఎం, సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్‌కు బంధువు. శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ఢిల్లీలో ఉన్నారు. అజిత్ పవార్ మృతివార్త తెలిసిన వెంటనే హుటాహుటీన పూణె బయలుదేరారు.