మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..అభ్యర్థిపై కాల్పులు..

  • Publish Date - October 21, 2019 / 08:21 AM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కానీ మధ్యాహ్నం ఓ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు దిగడం సంచలనం సృష్టించింది. అంతేగాకుండా ఆయన ప్రయాణిస్తున్న కారును సైతం తగులబెట్టారు. అభ్యర్థి సురక్షితంగా బయటపడ్డారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం అమరావతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 
కాంగ్రెస్ మిత్రపక్షమైన స్వాభిమాని పక్ష పార్టీ తరపున దేవేంద్ర భుయార్ మోర్షి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.

భుయార్ తన కార్యకర్తలతో కలిసి కారులో వెళుతున్నారు. బైక్‌పై ముసుగులు ధరించి వచ్చిన వ్యక్తులు కారును అడ్డుకున్నారు. బయటకు లాగి దాడి చేశారు. అనంతరం కాల్పులు జరిపారు. అంతటితో ఆగకుండా భుయార్ వాహనాన్ని తగులబెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గాయపడిన భుయార్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయన హెల్త్ కండీషన్ బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని కాల్పులకు తెగబడిన దుండగుల కోసం గాలింపులు చేపడుతున్నారు. ముగ్గురు నిందితులు దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఉదయం 11 గంటలకు 6.78 శాతం నమోదైంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు గాను 3,237 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో 235 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 8.9 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.  ఇందులో4.5 కోట్ల మంది పురుషులు కాగా…4 కోట్ల మంది మహిళలు. రాష్ట్రవ్యాప్తంగా 96,661 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరాఠ్వాడాలోని నాందేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 38 మంది పోటీ పడుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్‌-ఎన్‌సిపీ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 
Read More : ఆరెంజ్ అలర్ట్ : కేరళలో కుంభవృష్టి..ఇబ్బందులు పడుతున్న ఓటర్లు