శివసేనకు శరద్ పవార్‌ సపోర్ట్: మహారాష్ట్రలో మారుతున్న రాజకీయం

  • Publish Date - October 26, 2019 / 05:38 AM IST

మహారాష్ట్ర రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం దక్కించుకోవాలని భావించిన బీజేపీకి అటువంటి అవకాశం రాలేదు. కచ్చితంగా శివసేనతో కలిసి అధికారాన్ని పంచుకోవలసి వచ్చింది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలో చెరో రెండున్నరేళ్లు పంచుకుంటాయి అంటూ వార్తలు వస్తున్నాయి.

తొలి రెండున్నరేళ్లు ఫడ్నవిస్.. తర్వాత శివసేన తరఫున ఆదిత్య ఠాక్రే రెండున్నరేళ్లు కుర్చీని దక్కించుకుంటారు అని అంటున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ కూడా ఇదే. ఈ సారి ఎన్నికలకు ముందే బీజేపీ, శివసేన కూటమిగా ఏర్పడగా.. గత ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ 20కి పైగా స్థానాలను కోల్పోయింది. ఇక శివసేన తన స్థానాలను మాత్రం ఇంతకుముందు మాదిరిగా దక్కించుకుంది. 

ఈ క్రమంలో శివసేన మద్దతు పార్టీకి కచ్చితంగా అవసరం. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ తాజా ఫలితాల్లో బీజేపీ 103 సీట్లలో, శివసేన 56 సీట్లలో విజయం సాధించాయి. సాధించిన సీట్లను బట్టి అవసరమైతే శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ భావించింది. కానీ శివసేన మాత్రం రెండన్నరేళ్లు సీఎం పదవి కావాలని అంటుంది. రొటేషన్‌ పద్ధతిలో సీఎం పీఠాన్ని పంచుకోవాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మధ్య అవగాహన ఉన్నట్లు శివసేన నేతలు కూడా ఇప్పటికే బహిరంగంగా అంటున్నారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం పదవీకాలాన్ని పంచుకోవాలని శివసేన చేస్తున్న డిమాండ్‌లో ఎలాంటి తప్పూ లేదని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ అధినేత శరద్ పవార్‌ అన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాజపా, శివసేన కూటమిగా పోటీ చేశాయని, శివసేన కొత్తగా ఏం డిమాండ్‌ చేయడం లేదు.

1990లో కూడా ‘50-50’ ఫార్ములాను వారు అనుసరించారు. ఇంతకు ముందున్న అనుభవం కారణంగా ఇప్పుడు కూడా అదే డిమాండ్‌ చేస్తున్నారు. దానిలో ఎలాంటి తప్పూ లేదు. అని అన్నారు. శరద్ పవార్ వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవేళ శివసేన డిమాండ్ బీజేపీ ఒప్పుకోకుంటే కాంగ్రెస్‌.. ఎన్‌సీపీతో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం శివసేనకు ఉంది. అందుకే బీజేపీని శివసేన డిమాండ్‌ చేస్తుంది.