tests-coronavirus-positive
Maharashtra మహారాష్ట్రలో మళ్లీ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కూ కరోనా సోకింది. తనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు భుజ్‌బల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. ఇటీవలి రెండు, మూడు రోజుల్లో తనకు సమీపంలో వచ్చిన వారు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడాలని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.
కాగా, ఈ నెలలో కరోనా సోకిన రాష్ట్ర మంత్రుల్లో భుజ్‌బల్ ఏడో వ్యక్తి కావటం గమనార్హం. ఇప్పటి వరకు అనిల్ దేశ్‌ముఖ్, రాజేంద్ర షింగ్రే, జయంత్ పాటిల్, రాజేశ్ తోపే, సతేజ్‌పాటిల్, బచ్చు కాడుకు కరోనా వైరస్ సోకింది. ఇక, గతేడాది డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో సహా 12 మంది రాష్ట్ర మంత్రులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
మరోవైపు, కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. సోమవారం నుంచి వారం రోజులు అమరావతి జిల్లాలో పూర్తిగా లాక్‌డౌన్ విధించారు.ప్రజలు కరోనా కరోనా నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌన్ మరింతగా పొడిగించే అవకాశమున్నదని అధికారులు హెచ్చరించారు. ఇక, ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా పుణెలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేయడంతోపాటు రాత్రి వేళ కర్ఫ్యూ విధించారు.