మహా రాజకీయం : శివసేనకు బీజేపీ ఆఫర్

  • Publish Date - October 30, 2019 / 12:33 PM IST

మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాససనభా పక్ష నేతగా ఫడ్నవిస్‌ను ఎన్నుకున్నారు. దీంతో బీజేపీ తరఫున ఫడ్నవిస్‌ రెండోసారి  ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ – శివసేన కూటమికి తీర్పు ఇచ్చారని దేవేంద్ర ఫడ్నవిస్‌ అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయం పట్ల శివసేనకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ – శివసేన ప్రభుత్వమే ఏర్పడుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు ఫడ్నవిస్. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ 13-26 ఫార్ములాను తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం ఫడ్నవిస్ సీఎంగా ఏర్పడే క్యాబినెట్‌లో 26 మంత్రి పదవులు బీజేపీకి దక్కనున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవి సహా 13 మంత్రి పదవులు శివసేనకు దక్కుతాయి. ఐదేళ్ల వరకు తానే ముఖ్యమంత్రి పదవిలో ఉంటాని దేవేంద్ర ఫడ్నవిస్‌ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాక్రే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అక్టోబర్ 31వ తేదీ గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో శివసేన శాసనసభా పక్ష సమావేశం జరుపనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ -శివసేన కూటమి పూర్తి మెజారిటీని సాధించింది. అయితే, 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన – సీఎం పదవిని చెరి రెండున్నరేళ్ల పాటు పంచుకోవాలని పట్టుబడుతోంది. శివసేన ప్రతిపాదనను బీజేపీ నిరాకరించింది. తాజాగా బీజేపీ ప్రతిపాదనపై శివసేన ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది ఆసక్తిగా మారింది. 
Read More : నిజమెంత: అరబ్బుల తలపాగాతో మోడీ ఫొటో