MGNREGA: అందుకే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర సర్కారు తొలగిస్తోంది: కాంగ్రెస్
గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో గాంధీజీ పేరు ఉండడమే సమస్యనా? అని కేంద్ర సర్కారుని కాంగ్రెస్ ప్రశ్నించింది.
Priyanka Gandhi Vadra
MGNREGA: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) తొలగించి దాని స్థానంలో “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)” తీసుకురావాలని కేంద్ర సర్కారు ప్రయత్నిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు.
గ్రామీణ ఉపాధి హామీ పథక పేరు మార్పు వెనుక ఉన్న లక్ష్యం ఏంటని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. “మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగిస్తున్నారు? ఆయననే దేశంలో అతిపెద్ద నాయకుడిగా భావిస్తారు. పేరు మార్పుతో స్టేషనరీ, పేపర్‌వర్క్‌పై భారీ ఖర్చు ఉంటుంది” అని ఆమె అన్నారు.
“లక్ష్యం ఏంటో అర్థం కావడం లేదు. పార్లమెంట్ సక్రమంగా నడవడం లేదు. కీలక అంశాలపై చర్చ జరగడం లేదు. సమయం, ప్రజాధనం వృథా అవుతున్నాయి” అని ప్రియాంక గాంధీ చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. బీజేపీకి గతంలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ వంటి నేతలపైనే సమస్య ఉండేదని చెప్పారు. “ఇప్పుడు దేశం చూస్తోంది, బాపూజీ కూడా వారికి సమస్యగా మారారు. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ కింద రాష్ట్రాలకు సకాలంలో చెల్లింపులు చేయాలి. 100 రోజుల్ని 150 రోజులకు పెంచాలి, పథకాన్ని మెరుగుపరచాలి. పేర్లు మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టడం సిగ్గుచేటు” అని ఆమె మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ప్రవేశపెడుతున్న బిల్లును సంక్షిప్తంగా వీ బీ జీ రామ్ జీ అని పిలుస్తున్నారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధి లక్ష్యాలతో ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు.
