పోలీసులు వచ్చేశారని భయపడి.. హోటల్‌ నుంచి తప్పించుకునేందుకు ఈ అమ్మాయి చేసిన పని గురించి తెలిస్తే..

పార్టీలో రెచ్చిపోయారు. గట్టిగా సౌండు పెట్టి మ్యూజిక్‌ వింటూ, డ్యాన్స్‌ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.

పోలీసులు వచ్చేశారని భయపడి.. హోటల్‌ నుంచి తప్పించుకునేందుకు ఈ అమ్మాయి చేసిన పని గురించి తెలిస్తే..

Representative Image

Updated On : December 15, 2025 / 3:52 PM IST

Bengaluru: అర్ధరాత్రి దాటాక హోటల్‌లో పార్టీ జరుగుతోంది. ఫిర్యాదులు రావడంతో పోలీసులు అక్కడకు వచ్చారు. దీంతో ఓ యువతి (21) బాల్కనీ నుంచి డ్రెయిన్ పైపులను పట్టుకుని కిందకు జారుతూ వెళ్లాలని ప్రయత్నించింది. సర్రున జారడంతో కింద పడిపోయింది. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటన బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని సీ ఎస్టా లాడ్జ్‌లో జరిగింది. ఆమెతో పాటు ఏడుగురు స్నేహితులు కూడా అక్కడకు వెళ్లారని ఆమె తండ్రి ఆంటోని తెలిపారు. (Bengaluru)

అయితే, పార్టీలో తప్పతాగి రెచ్చిపోయారు. గట్టిగా సౌండు పెట్టి మ్యూజిక్‌ వింటూ, డ్యాన్స్‌ చేస్తూ రచ్చ రచ్చ చేశారు. దీంతో స్థానికులు 112 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read: MGNREGA: అందుకే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర సర్కారు తొలగిస్తోంది: కాంగ్రెస్‌

ఆ యువతి స్నేహితులతో కలిసి హోటల్‌లో 3 గదులు బుక్ చేసుకుని, అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పార్టీ చేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసులు లాడ్జ్‌కు చేరుకుని.. పార్టీ చేసుకుంటున్న వారిని మందలించారు.

కేసు బుక్‌ చేస్తామని అక్కడున్న అబ్బాయిలను బెదిరించిన పోలీసులు.. వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

ఆ సమయంలో పోలీసులతో మాట్లాడిన వెంటనే ఆ యువతి.. భయాందోళనలకు గురై నాలుగో అంతస్తులోని గది బాల్కనీ నుంచి డ్రెయిన్ పైపు ఎక్కి దిగే ప్రయత్నం చేసి, జారి కింద పడిపోయింది.. తీవ్ర గాయాలు అయ్యాయి.

పోలీసు అధికారులు సీ ఎస్టా లాడ్జ్ యజమానిపై కేసు నమోదు చేశారు. బాల్కనీ ప్రాంతంలో తగిన భద్రతా ఏర్పాట్లు లేవని లాడ్జ్ నిర్వాహకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కేసులో పేర్కొన్నారు. నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.