G Ram G: ఉపాధి హామీ చట్టాన్ని తొలగించనున్న కేంద్రం.. కొత్తగా జీ రామ్‌ జీ పథకం.. ఇకపై మీకు..

బిల్లు ఆమోదం కోసం బీజేపీ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేసి, పార్లమెంట్‌కు హాజరును తప్పనిసరి చేసింది ఎన్డీఏ.

G Ram G: ఉపాధి హామీ చట్టాన్ని తొలగించనున్న కేంద్రం.. కొత్తగా జీ రామ్‌ జీ పథకం.. ఇకపై మీకు..

Updated On : December 15, 2025 / 2:47 PM IST

G Ram G: దేశ వ్యాప్తంగా 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA ) రద్దు చేసేందుకు ఎన్డీఏ సర్కారు సన్నాహాలు చేసుకుంటోంది. ఆ పథకం స్థానంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పథకానికి సంబంధించిన బిల్లు ప్రతులను ఇవాళ లోక్‌సభ సభ్యులకు అందించారు.

ఎంజీఎన్ఆర్‌ఈజీఏ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కోసం తీసుకొచ్చిన చట్టం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త బిల్లు పేరు “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)”. దీన్ని సంక్షిప్తంగా వీ బీ జీ రామ్ జీ అని పిలుస్తున్నారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధి లక్ష్యాలతో తీసుకొస్తున్న కొత్త పథకం ఇది.

బిల్లు ఆమోదం కోసం బీజేపీ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేసి, పార్లమెంట్‌కు హాజరును తప్పనిసరి చేసింది ఎన్డీఏ. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బిల్లు వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో భాగంగా ఉపయోగపడుతుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.

ఎన్నో మార్పులతో జీ రామ్ జీ
గత యూపీఏ ప్రభుత్వం 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఎంజీఎన్ఆర్‌ఈజీఏ.. గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి హామీని ఇస్తుంది. గత రెండు దశాబ్దాలుగా ఇది కీలక మార్పులు తీసుకొచ్చింది. కొత్త బిల్లు 100 రోజుల హామీని 125 రోజులకు పెంచాలని ప్రతిపాదిస్తోంది. పనులు పూర్తైన తరువాత 7 రోజులు లేదా 15 రోజుల్లో చెల్లింపులు జరగాలని సూచిస్తోంది. గడువులోపు చెల్లింపులు జరగకపోతే నిరుద్యోగ భత్యం కూడా అందించే నిబంధనను పొందుపరిచింది.

Also Read: ఇందిరమ్మ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడాలంటే ఈ కార్డు పక్కాగా ఉండాలి..

పథకంలో పనులను నాలుగు విభాగాలుగా విభజించాలని ఈ కొత్త బిల్లు చెబుతోంది. అవి నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి మౌలిక సదుపాయాలు, విపత్తు నిరోధకత. పారదర్శకత కోసం బయోమెట్రిక్స్, జియోట్యాగింగ్ వినియోగిస్తారు. వివిధ స్థాయుల్లో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా ప్రతిపాదించారు.

మరో కీలక తేడా ఉంది. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ కేంద్ర ప్రాయోజిత పథకం. నైపుణ్యంలేని కార్మికుల వేతనాలను కేంద్రం 100 శాతం భరిస్తుంది. నైపుణ్య కార్మికులు, సామగ్రి ఖర్చుల్లో స్వల్ప భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. జీ రామ్ జీ పథకంలో కేంద్రం, రాష్ట్రాలు ఖర్చులను 60:40 నిష్పత్తిలో పంచుకుంటాయి.

ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90:10 నిష్పత్తి వర్తిస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు 100 శాతం కేంద్రం భరిస్తుంది. వార్షికంగా ప్రతిపాదించిన రూ 1.51 లక్షల కోట్ల వ్యయంలో కేంద్రం రూ 95,692 కోట్లు నిధులు అందిస్తుంది.