Maharashtra కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజు రోజుకి పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది.
సోమవారం నుంచి వారం రోజులు అమరావతి జిల్లాలో పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉంటుందని ఆదివారం మంత్రి యశోమతి ఠాకూర్ తెలిపారు. అమరావతి నగరంతో పాటు అచల్‌పూర్ పట్టణంలో ప్రధానంగా ఆంక్షలు ఉంటాయని అన్నారు. కేవలం నిత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రజలు కరోనా కరోనా నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌన్ మరింతగా పొడిగించే అవకాశమున్నదని హెచ్చరించారు.
మరోవైపు ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా పుణెలో ఫిబ్రవరి 28వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలను మూసివేయడంతోపాటు రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవర్ తెలిపారు. కొత్త నిబంధనలను సోమవారం విడుదల చేస్తామని పుణె డివిజనల్ కమిషనర్ చెప్పారు. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లో రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అమరావతి జిల్లాలో వారం రోజులు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇక, శనివారం మహారాష్ట్రలో 6,281 కొవిడ్ కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 40 మంది మహమ్మారి కారణంగా బలయ్యారు. ఇదిలా ఉండగా.. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మరోసారి లాక్‌డౌన్ తప్పదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కిశోరి పడ్నేకర్ హెచ్చరించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. ఆమె నగరంలో పర్యటించారు. కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ మాస్క్‌లు పంపిణీ చేశారు.