13ఏళ్లకే గాంధీ వివాహం : బాల్యంలో నిదానం.. చదువులో మధ్యస్థం

  • Publish Date - October 1, 2019 / 11:11 AM IST

అక్టోబర్ 2వ తేదీన గాంధీ 150వ జయంతి. గాంధీ పూర్తి పేరు.. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1869 అక్టోబరు 2వ తేదీన గుజరాత్ లోని కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. గాంధీ బాల్యంలో చాలా నిదానంగా ఉండే వారు. పోరు బందర్ సంస్ధానంలో గాంధీజీ తండ్రి ఒక దివాన్ గా పనిచేసేవారు. గాంధీజీ బాల్యం తల్లి దండ్రుల సంరక్షణలోనే కొనసాగింది.

ఆట పాటల్లో కూడా పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. పాఠశాల విడిచిన వెంటనే ఇంటికి వెళ్లి పోయేవాడు. విద్యార్థి దశలో గాంధీ అబద్దాలకు దూరముగా ఉండేవారు. చదువులో గాంధీ మధ్యస్థంగా ఉండేవారు. తరగతి గదిలో ఎప్పుడూ వెనుక వరుస సీట్లలోనే కూర్చొనేవారు. పోర్ బందర్ లో ప్రాథమిక విద్యను అభ్యసించిన గాంధీ.. రాజ్ కోట్ లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. 

కాపీ కొట్టమన్న మాస్టర్.. నిరాకరించిన గాంధీ : 
విద్యార్థి దశలో ఒకసారి గాంధీకి పెద్ద పరీక్ష ఎదురైంది. చదువులో అంతంతమాత్రం చదివే గాంధీకి పరీక్ష ఎదుర్కొన్నారు. గాంధీ చదివే పాఠశాలకు ఓ మాస్టర్ వచ్చి పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఆయన ఉత్తర్ణీత కాలేకపోయారు. పరీక్షలో వచ్చిన ఏ ప్రశ్నకు కూడా సరైన సమాధానాలు రాయలేకపోయారు. గాంధీని కూడా ఆయన పరీక్షించారు. పరీక్షలో సమాధానాలు రాలేక ఇబ్బందిపడుతున్న గాంధీని గమనించిన ఆ కొత్త మాస్టారు.. పక్క విద్యార్థుల సమాధానాలను చూసి రాయమని అన్నారు. అందుకు తాను రాయనని గాంధీ సూటిగా చెప్పేశారు. విద్యార్థి దశలోనే గాంధీకి బాల్యవివాహం జరిగింది. 13ఏళ్ల వయస్సులోనే కస్తూరి బాయిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి నలుగురు సంతానం. వారిలో హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ ఉన్నారు. 

లండన్‌లో బారిస్టర్ విద్య : 
వివాహమైనప్పటికి గాంధీజీ చదువును కూడా కొనసాగించారు. మెట్రిక్యులేషన్ పరీక్ష రాసి ఉత్తీర్ణుడు అయ్యారు. బాల్యం ఆరంభంలో చదువుల్లో మధ్యస్థంగా ఉన్నప్పటికీ బారిస్టర్ కోర్సు చదవాలనే కోరిక ఆయనలో బలంగా ఉండేది. తన 17ఏళ్ల వయస్సులో బారిస్టర్ న్యాయ విద్య చదివేందుకు లండన్ పట్టణానికి బయల్దేరి వెళ్లాడు. అప్పటికే చెడు అలవాట్లకు గురైన గాంధీ విషయంలో ఆయన తల్లి పుతిలీ బాయి ఆందోళన పడింది. లండన్ లో గాంధీ ఇంకా చెడు వ్యసనాలకు బానిస అవుతాడమేనని భయపడింది. లండన్ వెళ్లే ముందు గాంధీతో ప్రమాణం చేయించుకుంది. బాగా చదువుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పింది. 

తల్లి బాధను అర్థం చేసుకున్న గాంధీ.. సరే అని మాట ఇచ్చాడు. అలానే బారిస్టర్ న్యాయ విద్యను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం ముంబాయి, రాజ్‌కోట్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కానీ, గాంధీ ఆ వృత్తిలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గాంధీజీ 1893లో అబ్దుల్లా సేఠ్ అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ అడుగడుగునా జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్‌లో లా కంపెనీలో ఏడాది పాటు కాంట్రాక్టు న్యాయవాదిగా పనిచేశారు.