శబరిమల: కేరళ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలలోని శబరిగిరుల్లో మకర జ్యోతి ఈసాయంత్రం దర్శనమిచ్చింది. మకర జ్యోతి కనపడగానే శబరిగిరులు అయ్యప్ప శరణు ఘోషతో మారు మోగిపోయాయి. లక్షలాది మంది భక్తులు జ్యోతి దర్శనం చేసుకుని తరించారు. జ్యోతి దర్శనానికి సుమారు 18లక్షల మంది భక్తులు కొండపైకి చేరుకున్నట్లు అంచనా.
శబరిమల అయ్యప్పను అన్నివయస్సుల మహిళలు దర్శించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో ఈ ఏడాది కొన్ని ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. దీంతో ఎటువంటి అవాంఛనీయ పరిస్ధితులు తెలత్తకుండా దేవస్ధానం కేరళ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశాయి.
సోమవారం సాయంత్రం పందళం రాజవంశస్ధులు తీసుకువచ్చిన తిరువాభరణాలు అయ్యప్పస్వామికి అలంకరించి “తిరువాభరణ” ఘట్టం నిర్వహించారు. స్వామికి హారతి ఇచ్చే సమయంలోనే …ఆలయానికి ఈశాన్యదిశలో మకరజ్యోతి కొన్ని సెకండ్లపాటు దర్శనమిచ్చింది. మకరజ్యోతిని దర్శించుకునేందుకే లక్షల సంఖ్యలోని అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకుని శబరిమల కొండకు చేరుకుంటారు. ఈ మకరజ్యోతి దర్శనం ఎన్నోజన్మల పుణ్యఫలంగా స్వాములు భావిస్తారు. భక్తుల దర్శనార్ధం జనవరి 19 వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. 20వ తేదీ పందళ రాజ వంశీయులు స్వామిని దర్శించుకుని పూజ చేసిన తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు.