దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రధాని మోడీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఫైర్ అయ్యారు. ప్రతి అంశంపై మాట్లాడే ప్రధాని మోడీ, దురదృష్టవశాత్తు మహిళల భద్రత అంశంపై మాట్లాడడం లేదన్నారు. ఉత్పత్తి రంగానికి బూస్ట్ ఇచ్చేలా ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా నుంచి భారత్.. రేప్ ఇన్ ఇండియాగా మారుతోందని అధిర్ విమర్శించారు.
అంతకముందు కశ్మీర్ అంశంపై అధిర్, షా మధ్య వాగ్వాదం జరిగింది. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి నెలకొన్నదా అన్న అంశంపై ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకున్నారు. కశ్మీర్ లోయ సంపూర్ణంగా సాధారణంగా ఉందని అమిత్ షా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో రక్తపాతం జరుగుతుందని కాంగ్రెస్ భావించిందని కానీ అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొన్నదని తెలిపారు. ఒక్క బుల్లెట్‌ను కూడా ఫైర్ చేయలేదన్నారు.
ప్రభుత్వం ఎప్పుడైనా నిర్బంధంలో ఉన్న కశ్మీరీ నేతలను రిలీజ్ చేస్తుందని షా తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా తండ్రిని కాంగ్రెస్ పార్టీనే 10 ఏళ్ల పాటు నిర్బంధించిందన్నారు. కశ్మీర్‌లో 99.5 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారనీ, కానీ అధిర్‌కు ఇది సాధారణ పరిస్థితిగా కనిపించడంలేదని అమిత్ షా అన్నారు.