Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి, త్రిపుల్ తలాక్ వంటి చట్టాల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడిన అనంతరం ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భార్యల్ని వదిలేసిన వారిపై చర్యలు తీసుకునేలా చట్టం చేయాలంటూ మోదీని ఆయన భార్య యశోదా బెన్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
మంగళవారం భోపాల్‌లో ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఒకే కుటుంబంలోని సభ్యులకు రెండు చట్టాలు సాధ్యం కాదని, ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని బలమైన వాదన వినిపించారు. త్రిపుల్ తలాక్‌కు మద్దతిచ్చే వారిని విమర్శించారు. ట్రిపుల్ తలాక్ ఇస్లాంలో అంతర్భాగమైతే, పాకిస్తాన్‌కు ఎందుకు లేదని మోదీ ప్రశ్నించారు.
కాగా, ప్రధాని వ్యాఖ్యలపై ఒవైసీ స్పందిస్తూ “పాకిస్తాన్ చట్టాల నుంచి మోడీజీ ఎందుకు అంత స్ఫూర్తి పొందుతున్నారు? మీరు (మోదీ) ఇక్కడ (భారతదేశం) త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం కూడా చేశారు. కానీ దాని వల్ల ఆచరణలో ఎటువంటి ఉపయోగం రాలేదు. మహిళలపై దోపిడీ మరింత పెరిగింది. చట్టాల ద్వారా సంఘ సంస్కరణ జరగదని మేం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాం. చట్టం చేయాల్సి వస్తే భార్యను వదిలేసి పారిపోయే మగవారిపైనా చేయాలి” అని అన్నారు.
Pragati Maidan Tunnel: ఢిల్లీలో హైటెక్ చోరీలు.. కార్లు ఆపని టన్నెల్ కేంద్రంగా నేరాలు
అంతకు ముందు మోదీ మాట్లాడుతూ ‘‘యూసీసీని బూచిగా చూపిస్తూ, ముస్లింలను కొందరు రెచ్చగొడుతున్నారు. కుటుంబంలో ఒకరి కోసం ఒక చట్టం, మరొకరి కోసం మరొక చట్టం అమలైతే, ఆ కుటుంబం సజావుగా నడవగలదా? ఇటువంటి ద్వంద్వ వ్యవస్థతో మన దేశం ఎలా పురోగమించగలుగుతుంది? 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుంది. అందుకే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి’’ అని అన్నారు.