Anil Agarwal: కొడుకు ఆకస్మిక మరణంతో వేదాంత గ్రూప్ చైర్మన్ కీలక నిర్ణయం.. సంపాదనలో 75శాతం
తండ్రి కంటే ముందుగా కొడుకు ఈ లోకాన్ని విడిచి వెళ్లకూడదు. బిడ్డకు వీడ్కోలు చెప్పాల్సిన తల్లిదండ్రుల బాధ మాటల్లో వర్ణించలేనిదన్నారు.
Anil Agarwal
Anil Agarwal: వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పెద్ద కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. స్కీయింగ్ ప్రమాదం నుండి కోలుకుంటున్న సమయంలో న్యూయార్క్‌లో గుండెపోటుకు గురై అగ్నివేష్ మరణించారు. ఆయన వయసు 49 ఏళ్లు. కొడుకు ఆకస్మిక మరణం నేపథ్యంలో వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం తమ సంపాదనలో 75శాతం సమాజానికి ఇస్తానని తెలిపారు.
తన వ్యక్తిగత సంపదలో 75 శాతానికి పైగా దానం చేస్తాననే తన దీర్ఘకాల వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. దాతృత్వం అనేది తాను, తన కుమారుడు తరచుగా మాట్లాడుకునే ఒక ఉమ్మడి కల అని ఆయన అన్నారు. ఆకలితో ఎవరూ నిద్రపోకూడదని, విద్యకు దూరం కాకూడదని, స్త్రీలు తమ కాళ్లపై నిలబడాలని, యువతకు సరైన పని ఉండాలని నేను, నా కొడుకు కలలు కన్నామని అనిల్ అగర్వాల్ చెప్పారు. సంపాదించిన దాంట్లో 75% సొసైటీకి వెనక్కివ్వాలని అగ్నికి ప్రామిస్ చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.
కాగా, తన కుమారుడి ఆకస్మిక మరణాన్ని అనిల్ అగర్వాల్ తట్టుకోలేకపోతున్నారు. తన బిడ్డకు వీడ్కోలు చెప్పాల్సిన తల్లిదండ్రుల బాధ మాటల్లో వర్ణించలేనిదన్నారు. ”తండ్రి కంటే ముందుగా కొడుకు ఈ లోకాన్ని విడిచి వెళ్లకూడదు. ఈ నష్టం మమ్మల్ని తీవ్రంగా కుదిపేసింది, దానిని అర్థం చేసుకోవడానికి మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము” అని అగర్వాల్ ఎమోషనల్ అయ్యారు.
అగ్నివేష్ అగర్వాల్ జూన్ 3, 1976న పాట్నాలో అనిల్, కిరణ్ అగర్వాల్ దంపతులకు జన్మించారు. ఉన్నత విద్య కోసం యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే ముందు, ఆయన అజ్మీర్‌లోని ప్రతిష్టాత్మక మేయో కాలేజీలో చదువుకున్నారు. నివేదికల ప్రకారం, అగ్నివేష్ తన చదువు పూర్తి చేసిన వెంటనే వేదాంత గ్రూప్‌లో చేరలేదు. బదులుగా ఆయన ఫైనాన్స్, గ్లోబల్ బిజినెస్ మోడల్స్ కార్పొరేట్ గవర్నెన్స్‌లో అంతర్జాతీయ వృత్తిపరమైన అనుభవాన్ని పొందారు.
హిందుస్థాన్ జింక్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు..
తన కెరీర్‌లో అగ్నివేష్ ఫుజైరా గోల్డ్‌ను స్థాపించారు. దేశంలోని అతిపెద్ద సమీకృత జింక్ ఉత్పత్తిదారులలో ఒకటైన హిందుస్థాన్ జింక్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు. పంజాబ్‌లోని ఒక ప్రధాన ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్ తల్వండి సాబో పవర్ లిమిటెడ్ (TSPL) బోర్డులో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు.
అగ్నివేష్ యునైటెడ్ స్టేట్స్‌లో స్కీయింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం మెరుగుపడిన సంకేతాలు కనిపించినా దురదృష్టవశాత్తు ఆకస్మిక గుండెపోటుతో ఆయన మరణించారు.
వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడైన అనిల్ అగర్వాల్ స్క్రాప్ మెటల్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో ఆయన సక్సెస్ సాధించారు. దశాబ్దాలుగా, అగర్వాల్ చట్టపరమైన కేసులు సహా అనేక సవాళ్లను అధిగమించి, కంపెనీని అంచెలంచెలుగా నిర్మించారు. ఆయన కిరణ్ అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అగ్నివేష్, ప్రియా అగర్వాల్ హెబ్బర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తన సంపదలో 75 శాతాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని అనిల్ ప్రతిజ్ఞ చేశారు. అనిల్ అగర్వాల్, ఆయన కుమార్తె ప్రియ 2021లో బిల్ గేట్స్ ప్రారంభించిన ‘గివింగ్ ప్లెడ్జ్’ కార్యక్రమంలో చేరారు.
అగ్నివేశ్ మరణానంతరం వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ సమాజానికి తిరిగి సేవ చేయాలనే తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. స్వయం సమృద్ధిగల భారతదేశాన్ని నిర్మించాలనే తన కుమారుడి నమ్మకాన్ని గౌరవిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ దేశంలో దేనికీ కొరత లేదు, ఇది ఎప్పటికీ వెనుకబడి ఉండకూడదు అనేది తన కొడుకు విజన్ అని ఆయన గుర్తు చేశారు.
Also Read: ట్రంప్ 500% సుంకాలు: ఆ బిల్లులో ఏముంది? భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఆర్థిక విపత్తు ముప్పు?
