ట్రంప్‌ 500% సుంకాలు: ఆ బిల్లులో ఏముంది? భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఆర్థిక విపత్తు ముప్పు?

భారత్ ఈ వాణిజ్య ఒత్తిడిని “అన్యాయమైనది, అనవసరమైనది”గా అభివర్ణించింది.

ట్రంప్‌ 500% సుంకాలు: ఆ బిల్లులో ఏముంది? భారత్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఆర్థిక విపత్తు ముప్పు?

Modi, Trump (Image Credit To Original Source)

Updated On : January 8, 2026 / 7:31 PM IST
  • “సాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025” పేరుతో బిల్లు
  • రష్యా యుద్ధ యంత్రాంగాన్ని కుంగదీయడమే లక్ష్యం
  • రష్యా నుంచి పెట్రోలియం దిగుమతి చేసుకునే దేశాలపై 500% టారిఫ్

Donald Trump: అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన రంగాలను పూర్తిగా మార్చేసేంత పవర్ ఉండేలా రూపొందించిన ఓ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పచ్చజెండా ఊపారు. దీంతో ఆ బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నాలు జరుగుతాయి.

“సాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025” పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు రష్యా యుద్ధ యంత్రాంగాన్ని కుంగదీసే లక్ష్యంతో రూపొందింది. రష్యా నుంచి పెట్రోలియం, యురేనియాన్ని దిగుమతి చేసుకునే దేశాల అన్ని వస్తువులు, సేవల ఎగుమతులపై 500% టారిఫ్ విధించే ప్రతిపాదన ఇందులో ఉంది.

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ పాటిస్తున్న “అమెరికా ఫస్ట్” వాణిజ్య విధానంలో ఇదో కీలక మలుపు. యుక్రెయిన్ సంక్షోభం వేళ శాంతి ఒప్పందం సాధించాలనే దృఢ సంకల్పం ఇందులో ప్రతిబింబిస్తుంది.

సెనేటర్ గ్రాహమ్ ఏమన్నారు?
ఈ బిల్లుకు సంబంధించిన అన్ని బాధ్యతలను సెనేటర్లు లిండ్సే గ్రాహమ్, రిచర్డ్ బ్లూమెన్థాల్ తీసుకున్నారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోళ్లను కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడు కనీసం 500% దిగుమతి సుంకాలను విధించే వీలును ఈ బిల్లు కల్పిస్తుంది.

సెనేటర్ గ్రాహమ్ దీనిపై స్పందిస్తూ.. “చైనా, భారత్, బ్రెజిల్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలపై బాగా ఒత్తిడి తెచ్చే సాధనంగా ఈ బిల్లు మారుతుంది” అని అన్నారు.

“రష్యా సైనిక యంత్రాంగానికి నిధులు సమకూర్చే, చౌకగా ఆ దేశ చమురును కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించే అధికారాన్ని ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇస్తుంది” అని గ్రాహమ్ తెలిపారు. శాంతిని నెలకొల్పే విషయంలో యుక్రెయిన్ సానుకూలంగా ఉందని, రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అమాయకులను చంపుతూ మాటలకే పరిమితవుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ 500% టారిఫ్‌లు షరతులతో కూడి ఉంటాయి. యుక్రెయిన్‌తో శాంతి ఒప్పందంపై రష్యా చర్చలు జరపడం లేదని అమెరికా అధ్యక్షుడికి అనిపిస్తే ఈ టారిఫ్‌లు అమలులోకి వస్తాయి.

ఒకవేళ శాంతి ఒప్పందం కుదిరి, అమల్లో ఉంటే, యుక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలను రష్యా నిలిపివేసినా, మరిన్ని సైనిక ఆక్రమణలు జరగకపోయినా ఆంక్షలను ఎత్తివేస్తారు.

Also Read: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. “ఐప్యాక్”పై ఈడీ దాడులు.. హుటాహుటిన మమతా బెనర్జీ వెళ్లి..

భారత్‌పై తీవ్ర ప్రభావం
ఈ కొత్త బిల్లు భారత్‌పై తీవ్ర ప్రభావం పడేలా చేస్తుంది. 2025 ఆగస్టులో అమెరికా ప్రభుత్వం విధించిన 25% టారిఫ్‌ ఇప్పటికే భారత ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఆ టారిఫ్, ఇతర సుంకాలతో కలిసి కొన్ని భారత ఉత్పత్తులపై మొత్తం టారిఫ్‌లు 50%కి చేరాయి.

దీనిపై ఇప్పటికే అమెరికాతో భారత్‌ చర్చలు జరుపుతోంది. దీనిపై సెనేటర్ గ్రాహమ్ స్పందిస్తూ.. గత నెల అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తనను కలిశారని తెలిపారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను తగ్గించిందని వినయ్ మోహన్ క్వాత్రా చెప్పారని అన్నారు. “రిసిప్రోకల్” 25% సుంకాన్ని తొలగించాలని మోహన్ క్వాత్రా అన్నారని గ్రాహమ్ తెలిపారు.

హౌస్ రిపబ్లికన్లను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వాణిజ్య విధానాలపై సంతోషంగా లేరని ట్రంప్ అంగీకరించారు. అయితే, రష్యా చమురు దిగుమతులను భారత్ గణనీయంగా తగ్గించిందని తెలిపారు.

అయినప్పటికీ అమెరికా విధానానికి భారత్ అనుగుణంగా లేకపోతే ఎల్‌కేట్స్ చాలా వేగంగా పెరిగే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ల్యాండెడ్ కాస్ట్ టారిఫ్‌లను ఎల్‌కేట్స్ అంటారు. అంటే దిగుమతి చేసే వస్తువులపై విధించే మొత్తం సుంకాల భారం (ప్రాథమిక టారిఫ్‌లు, అదనపు పన్నులు కలిపి విధించే తుది టారిఫ్ రేట్లు).

ఆర్థిక విపత్తు పొంచి ఉంటుందా?
సెనేటర్ రాండ్ పాల్ వంటి వారు ఈ బిల్లును కొందరు విమర్శిస్తున్నారు. ప్రపంచంలో ఆర్థిక విపత్తు సంభవించే ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. ఏదైనా దేశం నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి, సేవపై 500% టారిఫ్ వేస్తే, ఆ దేశంతో వాణిజ్యం చేయడం ఆర్థికంగా అసాధ్యంగా మారుతుంది. దాని ఫలితంగా వాస్తవంగా ఆ దేశంపై పూర్తిస్థాయి వాణిజ్య నిషేధం అమలైనట్టే ప్రభావం ఉంటుంది.

భారత్ స్పందన
భారత్ ఈ వాణిజ్య ఒత్తిడిని “అన్యాయమైనది, అనవసరమైనది”గా అభివర్ణించింది. 140 కోట్ల భారత ప్రజల ఇంధన భద్రత అంశం అత్యంత ప్రాధాన్యమైందని పేర్కొంది.

ఇంధన దిగుమతుల్లో మార్పులు
భారత్ దిగుమతుల విషయంలో ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోంది. అమెరికా ముడి చమురు కొనుగోళ్లు దాదాపు 11% స్థాయికి పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ రిఫైనర్లు.. రోస్నెఫ్ట్, లూకాయిల్ వంటి రష్యా కంపెనీల నుంచి కొనుగోళ్లను తగ్గించాయి.

సాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 బిల్లు వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. రష్యా పెట్రోలియం ఉత్పత్తులు, యురేనియం, సహజ వాయువు కొనుగోలు కొనసాగించే దేశాల అన్ని వస్తువులు, సేవలపై కనీసం 500% టారిఫ్ విధించే అసాధారణ అధికారాలను అమెరికా అధ్యక్షుడికి ఈ బిల్లు ఇస్తుంది.

బిల్లుపై వచ్చే వారమే ఓటింగ్
సెనేటర్ లిండ్సే గ్రాహమ్‌తో జరిగిన ఓ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ ఈ బిల్లు ముందుకు సాగేందుకు ఆమోదించారు. చైనా, భారత్, బ్రెజిల్ వంటి ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు లక్ష్యంగా ఉన్నాయి. రష్యాకు ఆయా దేశాల నుంచి ఉన్న మద్దతును లేకుండా చేసేందుకు ఈ బిల్లును “ఆర్థిక బంకర్ బస్టర్”లా రూపొందించారు.

వచ్చే వారమే దీనిపై ద్విపక్ష సెనేట్ ఓటింగ్ జరగవచ్చు. జాతీయ భద్రత అంశాలపై మినహాయింపు క్లాజ్ కూడా ఇందులో ఉంది. రష్యా-యుక్రెయిన్ మధ్య శాంతి సాధనకు దేశాలు ఇచ్చే దౌత్య సహకారం ఆధారంగా తీవ్ర శిక్షలు విధించాలా? వద్దా? అనే అంశాన్ని నిర్ణయించే అధికారాన్ని దీనిలో పొందుపరిచారు.