బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. “ఐప్యాక్”పై ఈడీ దాడులు.. హుటాహుటిన మమతా బెనర్జీ వెళ్లి..

దర్యాప్తుల పేరుతో తమ పార్టీ పత్రాలు, డేటాను స్వాధీనం చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. “ఐప్యాక్”పై ఈడీ దాడులు.. హుటాహుటిన మమతా బెనర్జీ వెళ్లి..

Mamata Banerjee (Image Credit To Original Source)

Updated On : January 8, 2026 / 5:53 PM IST
  • మరో రెండు-మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు
  • ఫేక్‌ గవర్నమెంట్‌ జాబ్స్‌ స్కామ్‌లో ఈడీ సోదాలు
  • ఐ-ప్యాక్ ఆఫీస్, సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ..

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో మరో రెండు-మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ కోల్‌కతాలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు చేస్తుండడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని ఓ ముఠా మోసాలకు పాల్పడ్డ కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఈడీ ఈ దాడులు చేస్తోంది.

ఇందులో భాగంగా ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యాలయం, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ ఈడీ దాడులు చేసింది. ఇవాళ ఈడీ దాడులు కొనసాగుతున్న సమయంలో ప్రతీక్ జైన్ నివాసం, ఐ-ప్యాక్ కార్యాలయాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సందర్శించారు.

Also Read: ఈ వేళల్లో అంతరాలయ దర్శనాలు నిలిపివేత.. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయ అధికారులు కీలక నిర్ణయం

కేంద్ర సర్కారు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆమె ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాత్రపై కూడా ఆమె సందేహాలు వ్యక్తం చేశారు.

నేనూ దాడి చేస్తే..?
దర్యాప్తుల పేరుతో తమ పార్టీ పత్రాలు, డేటాను స్వాధీనం చేసుకుంటున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని అన్నారు.

“మా పార్టీ హార్డ్‌డిస్క్, అభ్యర్థుల జాబితా సేకరణే ఈడీ, అమిత్ షా పనా? దేశాన్ని రక్షించలేని హోం మంత్రి నా పార్టీ పత్రాలన్నింటినీ తీసుకుపోతున్నారు. నేను బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తే ఫలితం ఎలా ఉంటుంది?” అని ఆమె ప్రశ్నించారు.

బెంగాల్లో గెలవాలంటే బీజేపీ రాజకీయంగా తమతో పోటీ పడాలని అన్నారు. టీఎంసీ రిజిస్ట్రర్‌ అయిన రాజకీయ పార్టీ అని, ఆదాయ పన్ను చెల్లిస్తుందని చెప్పారు. ధన బలం, కండబలం ఉపయోగించి కేంద్రం తమను అణచివేయలేదని ఆమె అన్నారు. కాగా, ఈడీ తనిఖీల వేళ మమతా బెనర్జీ ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఏంటంటూ బీజేపీ అభ్యంతరాలు తెలిపింది.