పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచి భారత్‌లో హాయిగా 30 ఏళ్లపాటు ప్రభుత్వ టీచర్ జాబ్.. దొరికిపోయింది..
ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఉందని బయటపడిన తర్వాత విద్యా శాఖ ఆమెను సస్పెండ్ చేసి అనంతరం ఉద్యోగం నుంచి తొలగించింది.
Teacher Representative Image (Image Credit To Original Source)
- ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన
- ఆమెపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు
- పాకిస్థాన్ పాస్‌పోర్టుతో భారత్‌కు తిరిగివచ్చి మోసం
Pakistan: పాకిస్థాన్ పౌరసత్వాన్ని దాచి, భారతీయురాలినని చెప్పుకుంటూ ఓ మహిళ నకిలీ సర్టిఫికెట్లతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రాథమిక విద్యా శాఖలో ఏకంగా 30 ఏళ్లుగా టీచర్‌గా ఉద్యోగం చేసింది. ఇటీవల, ఆమె గుట్టురట్టవడంతో ఆమెపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహీరా అఖ్తర్ అలియాస్ ఫర్జానా నకిలీ పత్రాలు ఉపయోగించి ఉద్యోగం పొందినట్లు ప్రాథమిక విద్యా శాఖ గుర్తించింది. అనంతరం అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఆమెపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అనురాగ్ సింగ్ ఈ కేసు గురించి మాట్లాడుతూ.. నిందితురాలు కుమహరియా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిందని తెలిపారు.
“ఆమెపై న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 336, 338, 340 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. పాకిస్థాన్ పౌరురాలిగా ఉండి కూడా నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాన్ని ఉపయోగించి విద్యా శాఖలో ఉద్యోగం పొందినట్లు ఆరోపణ ఉంది” అని ఆయన చెప్పారు.
పాక్‌కు వెళ్లి.. మళ్లీ తిరిగి వచ్చి..
ఫర్జానా 1979లో పాకిస్థాన్ పౌరుడిని వివాహం చేసుకుని అనంతరం ఆ దేశ పౌరసత్వాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం విడాకులు తీసుకుని ఆమె పాకిస్థాన్ పాస్‌పోర్టుతో భారత్‌కు తిరిగివచ్చి 1985లో కుమహరియా గ్రామంలోని స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత తాను భారత పౌరురాలినని నకిలీ పత్రాలు చూపిస్తూ ప్రాథమిక విద్యా శాఖలో ఉద్యోగం పొందింది.
ఆమెకు పాకిస్థాన్ పౌరసత్వం ఉందని బయటపడిన తర్వాత విద్యా శాఖ ఆమెను సస్పెండ్ చేసి అనంతరం ఉద్యోగం నుంచి తొలగించింది. శాఖ అంతర్గత విచారణ నివేదిక ఆధారంగా పోలీస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఆధారాలు సేకరిస్తున్నామని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టు జరగలేదు.
