Mamata Banerjee
మోదీ గ్యారంటీ అంటే ప్రతిపక్ష నేతలందరినీ జైలులో పెట్టడమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆ పని చేస్తారని చెప్పారు. ఎన్నికల వేళ బీజేపీ మోదీ గ్యారంటీ అని ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అవినీతిని అంతమొందించేందుకు ఆయన చర్యలు తీసుకుంటారని బీజేపీ చెబుతోంది.
బంకురాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దీనిపై మమతా బెనర్జీ మాట్లాడుతూ… దేశం మొత్తాన్ని జైలుగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, టీఎంసీ నాయకులు అరెస్టయితే వారి భార్యలు వీధుల్లోకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించకుండానే ఎన్ఐఏ అధికారులు పుర్బా మేదినీపూర్ జిల్లాలోని భూపతినగర్ కు వెళ్లారని చెప్పారు.
ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడానికి మోదీ పశ్చిమ బెంగాల్ వస్తున్నారని, దీనిపై తనకు ఎలాంటి సమస్యలు లేవని, అయితే, ఎన్నికల తర్వాత విపక్ష నేతల అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతుండడం సరికాదని అన్నారు. ఓ ప్రధాని మాట్లాడేది ఇలాగేనా? అని అన్నారు.
ఒకవేళ తాను కూడా ఎన్నికల తర్వాత బీజేపీ నేతలను జైలులో పెడతానని అంటే ఎలా ఉంటుందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. కానీ, అటువంటి వ్యాఖ్యలు తాను చేయబోనని, ప్రజాస్వామ్యంలో ఇటవంటివి సరికాదని చెప్పారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ పశ్చిమ బెంగాల్లోని అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది.
Also Read: పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి షేక్ జలీల్ ఫిర్యాదు.. సంచలన ఆరోపణలు