మూడోసారి బెంగాల్ సీఎంగా..మే-5న మమత ప్రమాణస్వీకారం

పశ్చిమ బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ అధినేత్రి మమతా బెనర్జీ

MAMATA పశ్చిమ బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తృణమూల్​ కాంగ్రెస్(టీఎంసీ)​ అధినేత్రి మమతా బెనర్జీ..బుధవారం(మే-5,2021)ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 209 స్థానాల కంటే తాజా ఎన్నికల్లో నాలుగు స్థానాలు ఎక్కువే గెలుచుకుని వంగభూమిలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న దీదీకి..ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనుండటం వరుసగా ఇది మూడోసారి.

కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలతో సోమవారం పార్టీ అధిష్ఠానం సమావేశమైంది. ఈ సందర్భంగా దీదీని తమ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మే 5 న మమత సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి, సీనియర్‌ నేత పార్థ ఛటర్జీ తెలిపారు. ఇందుకోసం ఈరోజు రాత్రి 7 గంటలకు మమత.. గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ను కలవనున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు,కరోనా నేపథ్యంలో ప్రమాణస్వీకార కార్యక్రమం చాలా సింపుల్ గా ఉండనుందని స్వయంగా మమతాబెనర్జీనే వెల్లడించారు. అయితే,నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారిపై మమత ఓటమిపాలవ్వడంతో..ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి 6నెలల్లోపు శాసనసభ సభ్యురాలిగా మమతా బెనర్జీ గెలవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఆమె ఏ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు