మమతపై దాడి జరగలేదు..ఈసీకి పరిశీలకుల నివేదిక

మూడు రోజుల క్రితం నందిగ్రామ్ ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గాయాల పాలవడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.

Mamata’s injury accidental మూడు రోజుల క్రితం నందిగ్రామ్ ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ గాయాల పాలవడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. తనపై 4-5వ్యక్తులు దాడి చేశారని మమత చెబుతుంటే..సానుభూతి కోసమే డ్రామాలాడుతున్నారని బీజేపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది.

అసలు ఆ రోజు నందిగ్రామ్‌లో ఏం జరిగిందన్న దానిపై ఈసీ ఆరాతీసింది. నిజ నిర్ధారణ కోసం ప్రత్యేక పరిశీలకును నియమించింది. ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు వివేక్ దుబే, అజయ్ నాయక్ పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌కు వెళ్లి ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యక్ష సాక్షలతో మాట్లాడడంతో పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం ఈసీకి నివేదిక సమర్పించారు.

మమతా బెనర్జీపై ఎవరూ దాడి చేయలేదని.. అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన మాత్రమేనని ఎన్నికల సంఘం పరిశీలకులు తన నివేదికలో స్పష్టం చేశారు. ఆమెపై దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ఆ సమయంలో మమతా బెనర్జీ వెంట పోలీసులు కూడా ఉన్నారని తెలిపారు. అంతకుముందు బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలాపన్ బందోపాధ్యాయ్ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ.. అనంతరం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి పరిశీలకులు నివేదిక సమర్పించారు. మమతపై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు.

మరోవైపు ఘటనపై ప్రత్యక్ష సాక్షులను మీడియా అడిగినప్పుడు.. ఇది చిన్న యాక్సిడెంట్ అని, ఆమెపై ఎవరూ దాడి చేయలేదని చెప్పారు. కారు డోర్‌ను తెరిచి ఉంచి.. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో.. కారు డోర్‌ ఓ పిల్లర్‌కి తగిలి, బలంగా మూసుకుందని తెలిపారు. అది బలంగా మూసుకోవడం వల్లే మమత కాలికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.

కాగా, మమతా బెనర్జీ కోల్‌కతాలోని SSKM ఆస్పత్రిలో రెండు రోజుల చికిత్స అనంతరం శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. ఆమె ఎడమ కాలి మడిమ, చీలమండ దగ్గర తీవ్రమైన గాయం అయింది. ఎముకలో పగుళ్లు ఏర్పడ్డాయి. కుడి భుజం, కుడిచేతి మణికట్టుపైనా గాయాలు ఉన్నాయి. ఛాతీనొప్పితోనూ ఆమె బాధపడుతున్నారు. ఆమెకు నెలన్నర నుంచి రెండు నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు తెలిపారు.

ఇక, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి

ట్రెండింగ్ వార్తలు