టెన్షన్.. టెన్షన్: బంధీలుగా 20మంది చిన్నారులు

  • Publish Date - January 30, 2020 / 05:46 PM IST

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫరుఖాబాద్‌లో కలకలం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో 20మంది చిన్నారులు, మహిళలను గుర్తుతెలియని దుండగుడు నిర్బంధించాడు. పుట్టినరోజు పార్టీ అని పిలిచి, పిల్లలను, మహిళలను గృహ నిర్బంధం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే పోలీసులు పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకోవడంతో..  దుండగుడు పోలీసులపై గ్రనేడ్ విసిరాడు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులతో సహా నలుగురు గ్రామస్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

బెయిల్ పై విడుదులైన ఓ హత్య కేసు నిందితుడు తన భార్యను, ఏడాది వయస్సు కూతురిని, 12 మందికిపైగా పిల్లలను నిర్బంధించినట్లుగా పోలీసులు వెల్లడించారు. సుభాష్ భాతమ్ అనే ఆ వ్యక్తితో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. తన కూతురు జన్మదిన వేడుకలు అంటూ హత్య కేసు నిందితుడు గ్రామంలోని పిల్లలను తన ఇంటికి ఆహ్వానించి వాళ్లు ఇంట్లోకి రాగానే తుపాకితో బెదిరించి, తన భార్య, కూతుళ్లతో సహా పిల్లలను నిర్బంధించాడు.

తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో కొంత మంది గ్రామస్థులు వచ్చి ఇంటి తలుపులు తట్టాడంతో సుభాష్ భాతమ్ కాల్పులు జరిపాడు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి వద్దకు చేరుకోగా.. సుభాష్ భాతమ్ వారిపై టెర్రస్‌పై నుంచి కాల్పులు జరిపాడు. వారిపైకి ఓ నాటు బాంబు కూడా విసిరాడు. బందీలుగా ఉన్న పిల్లలకు ఏం జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడించారు. సహాయక చర్యలు సాగుతున్నాయి.