కలిచివేసే దృశ్యం : ఒలికిన పాలను..కుక్కలుతాగుతుంటే, ఓవ్యక్తి ముంతలో పట్టుకొంటున్నాడు

  • Publish Date - April 14, 2020 / 01:50 AM IST

భారతదేశంలో లాక్ డౌన్ అమలవుతోంది. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో ఈ గడువు ముగియబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంటోంది. కేసులు అధికమౌతుండడంతో లాక్ డౌన్ కంటిన్యూ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే..లాక్ డౌన్  కొనసాగుతుండడంతో ఎంతో మంది తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు.

వీరికి ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా..చాలా మందికి అవి చేరడం లేదనే పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా..ఓ ఘటన అందరినీ కలిచి వేస్తోంది. రోడ్డుపై ఒలికిన పాలను ఓ వైపు కుక్కలు ఆ జుర్రుకుంటుంటే..మరోవైపు ఓ వ్యక్తి ముంతలో పట్టుకునే దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

ఆగ్రాలో తాజ్ మహల్ కు ఆరు కిలో మీటుర్ల పరిధిలో 2020, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఓ భారీ మిల్క్ వ్యాన్ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న పాలన్నీ రోడ్డు పాలయ్యాయి. అక్కడనే ఉన్న కుక్కల గుంపు..పాలను తాగేందుకు ప్రయత్నించాయి.(ఇండియాలో కరోనా @ 10వేలు)

దీనిని చూసిన ఓ వ్యక్తి ఓ చిన్న ముంతను పట్టుకుని వచ్చాడు. రోడ్డుపై ఒలికిన పాలను దోసిలిలో పెట్టుకుని ముంతలో పోసే ప్రయత్నం చేశాడు. దీనిని కమల్ ఖాన్ అనే వ్యక్తి చూశాడు. ఓ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెంటనే వైరల్ అయిపోయింది. 

దేశ వ్యాప్తంగా మూడు వారాలుగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో వలస కార్మికులందరూ తమ తమ స్వస్థలాలకు చేరుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలి నడకన బయలు దేరుతున్నారు. చాలా మంది తినడానికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

దేశ వ్యాప్తంగా కొన్ని చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసి ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నాయి. వలస కూలీలకు ఆహారం అందించే ప్రయత్నం జరుగుతున్నా…ఇప్పటికీ కొంతమంది తిండికి అల్లాడిపోతున్నారు.