Ziona Chana : 38 మంది భార్యల ముద్దుల భర్త మృతి

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్దగా ఉన్న మిజోరాంకి చెందిన జియోన చన (78) ఆదివారం కన్నుమూశారు.

Ziona

Ziona Chana ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్దగా ఉన్న మిజోరాంకి చెందిన జియోన చన (78) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా డయాబెటిస్,హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న జియోన గత మూడు రోజలుగా బక్తవంగ్ గ్రామంలోని తన నివాసంలో ట్రీట్మెంట్ పొందుతున్న క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే ఐజ్వాల్ లోని ట్రినిటీ హాస్పిటల్ లో చేర్పించారు. అయితే ఇవాళ మధ్యాహ్నాం 3గంటల సమయంలో జియోన తుదిశ్వాస విడిచారని డాక్టర్లు తెలిపారు.

కాగా, 1945 జులై 21న జన్మించిన జియోన చనకి 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవళ్లు,మనవరాళ్లు ఉన్నారు. జియోన మరణంపై స్పందించిన మిజోరాం ముఖ్యంత్రి జోరాంతంగ..ఆయన కుటుంబం ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ..ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన మిజోరాం వాసి మిస్టర్ జియోన్‌కు బరువైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు. ఆయన గ్రామం బక్తంగ్ త్లంగ్నాంతో పాటు మిజోరాంకు కూడా అనేక మంది పర్యాటకులు రావడానికి ఆయన కుటుంబం ఒక కారణం అని సీఎం జోరాంతంగ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

17 ఏళ్ల వయస్సులో జియోనా వివాహం చేసుకున్నారు. మొదటి భార్య ఆయన కంటే మూడేళ్లు పెద్ద. మొత్తం కుటుంబ సభ్యులంతా చుహాన్‌ తార్‌ రన్‌ అనే నాలుగు అంతస్తుల భవనంలో నివాసం ఉంటారు. అందులో దాదాపు 100 గదులుంటాయి. ఆయన కొడుకులు, కోడళ్లు, పిల్లలు వేర్వేరు గదుల్లో ఉంటారు.కానీ, వారందరికీ వంటగది ఒక్కటే. అందరూ కలిసే భోజనాలు చేస్తారు. ఆయన పడక గదికి ఆనుకొని ఉన్న డార్మెటరీలో భార్యలంతా ఉంటారు. ప్రస్తుతం వారి సొంత వనరులతోనే జీవితం నెట్టుకొస్తుంటారు.