ప్రతినెల చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహిస్తున్న ‘మన్‌కీ బాత్’కార్యక్రమం ప్రస్తుతం ‘దేశ్‌కీ బాత్’ గా ప్రతి ఒక్కరి ‘దిల్‌కీ బాత్’గా మారిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన రేడియో జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు అవార్డులు అందజేశారు. ప్రజలు నమ్మదగిన, శక్తివంతమైన ప్రసార మాధ్యమం రేడియో అని అన్నారు.
ఈసందర్భంగా జవదేకర్ …. దేశంలోని రేడియో స్టేషన్లు, అందులో పనిచేసే వారి ప్రాధాన్యతను కొనియాడారు. ఆకాశవాణిలో ప్రధాని మోడీ విజయవంతంగా కొనసాగిస్తున్న మన్‌కీ బాత్ కార్యక్రమంపై ప్రశంసలవర్షం కురిపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 262 రేడియో స్టేషన్లు ఉండగా, వాటిని 500కు పెంచి మళ్లీ రేడియో రంగానికి పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఎన్‌డీఏ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక 75రోజుల్లో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలతో ‘జన్ కనెక్ట్’ అనే పుస్తకాన్ని జవదేకర్ విడుదల చేశారు